‘తేనె’ లోలికే తోట.. కాసులొలికే

స్వచ్ఛమైన తేనెకు మంచి డిమాండ్‌..

తేనెటీగల పెంపకంతో అదనపు ఆదాయం

సంస్థాన్‌ నారాయణపురం, ఆంధ్రప్రభ: తేనెటీగల పెంపకం ద్వారా రైతులు వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకట రమణారెడ్డి తెలిపారు. నారాయణపురం మండల పరిధిలోని మహమ్మదాబాద్‌ గ్రామంలో మల్లేపల్లి ప్రముఖరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో మిత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తేనెటీగల పెంపకాన్ని ఆయన సందర్శించారు.

వ్యవసాయ క్షేత్రంలో పండ్ల తోటలతో పాటు తేనెటీగల పెంపకం చేపట్టి ఆదాయం పొందుతున్న విధానాన్ని పరిశీలించారు. తొలుత 300 తేనెటీగల పెట్టెలతో పెంపకం ప్రారంభించగా.. ఒక్కో పెట్టె నుంచి సగటున రెండు కిలోల చొప్పున మొత్తం 600 కిలోల తేనె ఉత్పత్తి అవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కిలో తేనెను రూ.900 చొప్పున ‘రాచకొండ హనీ’ బ్రాండ్‌ పేరుతో విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.

మహమ్మదాబాద్‌తో పాటు నల్లగొండ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోనూ తేనెటీగల పెంపకాన్ని విస్తరించినట్లు తెలిపారు.

తేనెటీగల పెంపకంతో అదనపు ఆదాయం

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకట రమణారెడ్డి: రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా తేనెటీగల పెంపక కేంద్రాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. తేనెటీగల పెంపకం రైతులకు వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం అందించే మంచి అనుబంధ ఉపాధి అని అన్నారు.

తేనె ఉత్పత్తి ద్వారా ఆదాయం పొందడమే కాకుండా తేనెటీగల వల్ల పంటల్లో పరాగసంపర్కం మెరుగై దిగుబడి, నాణ్యత పెరగడానికి దోహదపడుతుందని వివరించారు. మిత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రైతులకు తేనెటీగల పెంపకం, నిర్వహణ పద్ధతులు, అవసరమైన సాంకేతిక సూచనలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

రైతులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వెంకట రమణారెడ్డి సూచించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి బి. పూజ, వ్యవసాయ విస్తరణ అధికారి కె. రాజేష్‌, పుట్టపాక మాజీ సర్పంచ్‌ మాధవరెడ్డి, ప్రముఖరెడ్డి, గూడూరు అంజిరెడ్డి, ఏపూరి సతీష్‌, రైతులు పాల్గొన్నారు.