సమస్యల పరిష్కారం కోసం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల శాంతియుత ధర్నా

భూపాలపల్లి, ఆంధ్రప్రభ: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహించిన శాంతియుత ధర్నాలో జయశంకర్‌ భూపాలపల్లి జాక్‌ కమిటీ పాల్గొని సంఘీభావం తెలిపింది. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, ఎన్‌హెచ్‌ఎం సిబ్బందికి న్యాయం చేయాలని కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఎన్‌హెచ్‌ఎం విభాగంలో ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఉద్యోగులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, వేతనాల పెంపు, సర్వీసుకు సంబంధించిన సమస్యల పరిష్కారం, ఉద్యోగుల సంక్షేమం తదితర డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌లో నిర్వహించిన ఈ శాంతియుత ధర్నాలో భూపాలపల్లి జాక్‌ కమిటీ అధ్యక్షుడు బడితల రమేష్‌, ప్రధాన కార్యదర్శి మధుబాబు, కోశాధికారి శ్రీను, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెంకటేష్‌, సలహాదారు ప్రభాకర్‌, కోఆర్డినేటర్‌ ప్రవీణ్‌కుమార్‌గౌడ్‌, సామాజిక మాధ్యమాల ఇన్‌చార్జి రాజు, హరేందర్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన చేపట్టి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.