ఆంధ్రప్రభ వెబ్ న్యూస్ ఎఫెక్ట్‌..

యూరియా కోసం గంటల తరబడి నిరీక్షణ

వార్త ప్రచురితమైన వెంటనే స్పందించిన అధికారులు..

రైతులకు యూరియా పంపిణీ

వేల్పూర్, ఆంధ్రప్రభ: మండలంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. సోమవారం అమీనాపూర్‌ గ్రామ సొసైటీ కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకున్నప్పటికీ యూరియా అందకపోవడంతో వేల్పూర్‌తో పాటు పోచంపల్లి, అక్లూర్‌, పరిసర గ్రామాల నుంచి రైతులు సొసైటీ కేంద్రానికి తరలివచ్చారు.

గంటల తరబడి ఎండలో నిలబడి యూరియా కోసం నిరీక్షించారు. ప్రస్తుతం వరి, మొక్కజొన్న పంటలకు ఎరువులు వేయాల్సిన సమయం కావడంతో సకాలంలో యూరియా అందకపోతే దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా నిల్వలను తక్షణమే అందుబాటులో ఉంచడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా పంపిణీ చేయాలని అధికారులను కోరారు.

ఆంధ్రప్రభ వెబ్‌ న్యూస్‌ ఎఫెక్ట్‌

రైతుల ఇబ్బందులపై ఆంధ్రప్రభ వెబ్‌సైట్‌లో వార్త ప్రచురితమైన వెంటనే అధికారులు స్పందించారు. అమీనాపూర్‌ సొసైటీ కేంద్రంలో రైతులకు యూరియా పంపిణీ చేశారు. తమ సమస్యను వెలుగులోకి తీసుకువచ్చి అధికారులు స్పందించేలా చేసినందుకు రైతులు ఆంధ్రప్రభకు కృతజ్ఞతలు తెలిపారు.