Delhi | స్వాతంత్య్ర వేడుకల వేళ ఢిల్లీలో హైఅలర్ట్..
19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లు..
ఎర్రకోట వద్ద కట్టుదిట్టమైన భద్రత
Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.
ఇండియన్ ముజాహిదీన్, అల్‌ఖైదా, ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలకు చెందిన 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలతో నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు ఏర్పాటు చేశారు. పోస్టర్లలో వారి వివరాలను పొందుపరిచి.. అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఆగస్టు 15న జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రధాన వేదిక అయిన ఎర్రకోట వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతా కారణాలతో పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వేడుకల సందర్భంగా దాదాపు 15 నుంచి 20 వేల మంది పోలీసులు, పారామిలటరీ సిబ్బందిని భద్రత కోసం మోహరించనున్నట్లు అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల నిఘా, ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యేక తనిఖీలతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
