జనసేన పార్టీలో చేరిన కాంగ్రెస్‌ నాయకుడు కరాటే ప్రభాకర్

కాంగ్రెస్‌లో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నాను

కరీమాబాద్, ఆంధ్రప్రభ: గత 30 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ కోసం ఎంతో కృషి చేశానని, పార్టీ అధికారంలో లేని సమయంలోనూ ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని పనిచేశానని జనసేన పార్టీలో చేరిన కరాటే ప్రభాకర్‌ తెలిపారు. మంగళవారం 34వ డివిజన్‌ శివనగర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ మూడు ముక్కలుగా మారిందని ప్రభాకర్‌ ఆరోపించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడికి పదవి ఇచ్చినప్పటికీ కనీస గౌరవం, గుర్తింపు లేకుండా కొందరు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తూర్పు నియోజకవర్గంలో వచ్చిన పదవులను ‘నీకు ఒకటి.. నాకు ఒకటి’ అన్నట్టుగా పంచుకుంటున్నారని ఆరోపించారు. తనను ఎన్నో విధాలుగా ఒత్తిళ్లకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

రానున్న రోజుల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు జనసేనలో చేరే అవకాశం ఉందని ప్రభాకర్‌ తెలిపారు. తాను పవన్‌ కల్యాణ్‌ కోసం జనసేనలో చేరలేదని, పేదలకు మంచి చేయాలనే ఆయన ఆలోచనా విధానం నచ్చడంతో పార్టీలో చేరినట్లు చెప్పారు.

జనసేన అధిష్ఠానం ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తానని ప్రభాకర్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.