‘రోడ్ డాక్టర్’కు సీఎం ఆదేశం
- ప్రజల భాగస్వామ్యంతో జాతి నిర్మాణంలో ముందుకు సాగాలి
- జూలైలో 10.70 శాతం ఆర్థిక వృద్ధి..
- ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలని సూచన
- వివిధ శాఖల పనితీరుపై చంద్రబాబు సమీక్ష
అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా, వేగంగా అందేలా అధికారులు, ఉద్యోగులు పనిచేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ జాతి నిర్మాణంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
మంగళవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ‘పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్’ కార్యక్రమంపై చర్చించారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు మాత్రమే కాకుండా ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
రోడ్లపై గుంతలకు శాశ్వత పరిష్కారం..
రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ‘రోడ్ డాక్టర్’ పేరుతో జీరో పాత్‌హోల్ మిషన్ చేపట్టాలని అధికారులకు సూచించారు. రోడ్లపై గుంతలు ఏర్పడిన తర్వాత వాటిని రోజుల తరబడి అలాగే ఉంచకుండా వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కొన్ని ప్రాంతాల్లో ఈ విధానాన్ని ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని అధికారులు వివరించగా.. దాని ఫలితాలను పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం సూచించారు. రహదారుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.
ప్రజల మద్దతే ప్రభుత్వానికి బలం..
ప్రభుత్వం చేపట్టే మంచి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయగలిగితే వారి నుంచి మరింత మద్దతు లభిస్తుందని చంద్రబాబు అన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రజల నుంచి వచ్చిన స్పందన దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై వాస్తవాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తే ప్రభుత్వానికి ప్రజలే అండగా నిలుస్తారని చెప్పారు. కర్నూలులో డీఎస్సీ-2025 ఉపాధ్యాయులు చేపట్టిన కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తం..
రాష్ట్ర నెలవారీ ఆర్థిక ప్రగతిపైనా సమీక్ష నిర్వహించారు. జూలైలో రాష్ట్రం 10.70 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. అయితే రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆర్థిక ప్రగతికి ఆటంకం కలగకుండా ఇప్పటి నుంచే అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

