రైలులో రూ.10 లక్షల బంగారం.. నిజాయితీ చాటిన టీటీఐ

(విజయవాడ, ఆంధ్రప్రభ) : విధి నిర్వహణలో నిజాయితీ, బాధ్యతాయుతంగా వ్యవహరించిన విజయవాడ డివిజన్‌ సౌత్‌ కోస్ట్‌ రైల్వే టికెట్‌ తనిఖీ అధికారి ఏకే నాగ సుధీర్‌ ప్రశంసలు అందుకున్నారు. రైలులో ప్రయాణికుడు వదిలివెళ్లిన సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్‌ను గుర్తించి భద్రపరిచి రైల్వే రక్షణ దళానికి అప్పగించారు.విజయవాడ డివిజన్‌కు చెందిన టీటీఐ (అమెనిటీస్‌) ఏకే నాగ సుధీర్‌ రెణిగుంట–విజయవాడ మధ్య 18510 విశాఖపట్నం–బెంగళూరు కంటోన్మెంట్‌ ఎక్స్‌ప్రెస్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో బీ-1 కోచ్‌లో గుర్తుతెలియని, ఎవరూ తీసుకోని బ్యాగ్‌ను గుర్తించారు. విచారణ చేయగా, ఒంగోలు స్టేషన్‌లో దిగిపోయిన బీ-1 కోచ్‌ 58వ బెర్త్‌ ప్రయాణికుడికి ఆ బ్యాగ్‌ చెందినట్లు నిర్ధారించారు. బ్యాగ్‌లో సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లు గుర్తించిన సుధీర్‌ వెంటనే దానిని భద్రపరిచారు. అనంతరం అధికారిక ప్రక్రియ కోసం విజయవాడ రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్‌)కు అప్పగించారు.

తద్వారా విలువైన వస్తువులు సురక్షితంగా యజమానికి చేరేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ బి.ప్రశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. సుధీర్‌ ప్రదర్శించిన నిజాయితీ భారతీయ రైల్వేల విలువలకు ప్రతిబింబమని అన్నారు. విధి పట్ల అంకితభావం, సమయస్ఫూర్తితో ఆయన సేవా ప్రమాణాలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఏకే నాగ సుధీర్‌ నిజాయితీ, సమయస్ఫూర్తిని విజయవాడ డివిజన్‌ సౌత్‌ కోస్ట్‌ రైల్వే అధికారులు అభినందించారు. ఆయన చర్యలు విజయవాడ డివిజన్‌తో పాటు భారతీయ రైల్వేల ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేస్తాయని పేర్కొన్నారు.