జూలై నెల ఆర్థిక నివేదిక వెల్లడి

  • వివిధ రంగాల్లో గణనీయమైన వృద్ధి
  • పారిశ్రామిక ఉత్పత్తి 8.2 శాతం పెరుగుదల..
  • పర్యాటక రంగానికీ ఊతం
  • 15 శాతం వృద్ధి లక్ష్యంగా సమగ్ర కార్యాచరణ..
  • సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రతికూల వాతావరణ పరిస్థితులు వెంటాడుతున్నప్పటికీ ఏపీ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి కొనసాగుతున్నట్లు జూలై నెల నెలవారీ ఆర్థిక నివేదిక వెల్లడించింది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో పలు సూచీలు మెరుగైన పనితీరును కనబరిచినట్లు నివేదిక పేర్కొంది. జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే వరుసగా రెండేళ్లుగా రాష్ట్రం మెరుగైన వృద్ధిని నమోదు చేస్తోందని వివరించింది.

జూలై నెల ఆర్థిక నివేదికను ప్రణాళికా విభాగం అధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి, వివిధ రంగాల పురోగతి, పెట్టుబడులు, పన్నుల ఆదాయం తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. 2023-24లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వాస్తవ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండగా.. 2025-26లో అది 9.9 శాతానికి చేరినట్లు నివేదికలో పేర్కొన్నారు.

పరిశ్రమల్లో ఊపు..

2026 జూన్‌తో పోలిస్తే జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి 8.2 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి 89,383 మెట్రిక్‌ టన్నులకు చేరి భారీ వృద్ధిని నమోదు చేసింది. కూరగాయల ఉత్పత్తిలోనూ 44.8 శాతం పెరుగుదల నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

పశుసంవర్ధక రంగంలో మాంసం ఉత్పత్తి 9.6 శాతం, గుడ్ల ఉత్పత్తి 5.1 శాతం, సముద్ర రొయ్యల ఉత్పత్తి 17 శాతం మేర పెరిగినట్లు నివేదిక పేర్కొంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఈ వృద్ధి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతంగా అధికారులు వివరించారు.

సేవా రంగంలో పురోగతి

సమాచార సాంకేతిక, రవాణా, వాణిజ్య కార్యకలాపాల్లో గణనీయమైన పురోగతి కనిపించినట్లు నివేదిక తెలిపింది. సాధారణ ఎగుమతుల విలువ రూ.16,322 కోట్లకు చేరి 10.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎస్‌టీపీఐ ఎగుమతులు 32.2 శాతం పెరగగా.. వాణిజ్య వాహనాల కొనుగోళ్లలో 51.6 శాతం వృద్ధి నమోదైంది.సాంకేతికతను పన్నుల వ్యవస్థతో అనుసంధానం చేయడం ద్వారా జీఎస్టీ వసూళ్లు కూడా పెరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. జీఎస్టీ ఆదాయం 21 శాతం వృద్ధితో రూ.13,282 కోట్లకు చేరినట్లు నివేదికలో పేర్కొన్నారు.

పర్యాటక రంగానికీ భారీ ఊతం..

జూలైలో రాష్ట్రానికి దేశీయ, విదేశీ పర్యాటకుల రాక గణనీయంగా పెరిగింది. నెలలో 3.10 కోట్ల మంది దేశీయ పర్యాటకులు, 35,951 మంది విదేశీ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించినట్లు ఆర్థిక నివేదిక వెల్లడించింది. దీంతో పర్యాటక రంగంతోపాటు దానికి అనుబంధంగా ఉన్న రవాణా, వాణిజ్య కార్యకలాపాలకు కూడా ప్రయోజనం కలిగినట్లు అధికారులు వివరించారు.

పెట్టుబడుల ప్రవాహం ఆశాజనకం..

రాష్ట్రంలో పెట్టుబడుల పరిస్థితి కూడా సానుకూలంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. రూ.2.88 లక్షల కోట్ల విలువైన మెగా ప్రాజెక్టుల పెట్టుబడుల గ్రౌండింగ్‌లో 75.4 శాతం పురోగతి నమోదైనట్లు పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో సుమారు రూ.60 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 73.6 శాతం పురోగతి సాధించినట్లు వివరించింది.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసి 15 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రానున్న కాలంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నందున.. ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టి వృద్ధి వేగానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.