మాజీ సర్పంచుల ముందస్తు అరెస్ట్..

బెజ్జంకి, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు హైదరాబాద్‌కు బయలుదేరిన మాజీ సర్పంచులను బెజ్జంకి పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
మండలంలోని పలు గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల పేరుతో వారిని మార్గమధ్యంలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల చర్యలపై మాజీ సర్పంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.
“మా హక్కుగా రావాల్సిన బిల్లుల కోసం శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని అడ్డుకుని అరెస్ట్ చేయడం అన్యాయం,” అని వారు పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు అప్పులు చేసి ఖర్చు చేసినప్పటికీ, సంవత్సరాలుగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
