జనాభా నిర్వహణ పై ప్రభుత్వం కీలక నిర్ణయం

జనాభా నిర్వహణ పై ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి, ఆంధ్రప్రభ ప్రతినిధి: రాష్ట్రంలో అధిక సంతానాన్ని ప్రోత్సహిస్తూ ‘పిల్లలే సంపద’ పేరిట కొత్త కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనాభా నిర్వహణపై సీరియస్‌గా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో మొత్తం 45 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి తాజా రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు. మంత్రుల సింగపూర్ పర్యటన, ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చాయి.

ప్రజల్లో విశ్వసనీయతే కొలమానం అని, అందుకు తగ్గట్టుగా కార్యాచరణ చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. డీజిల్, పెట్రోల్ కొరతపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకారం, కొరత లేకపోయినా ఉన్నట్టుగా ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్న వారిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విమర్శలను తిప్పికొట్టడంలో కొందరు మంత్రులు విఫలమవుతున్నారని, విపక్షం ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తోందని సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అవాస్తవాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని, కౌంటర్ అటాక్ ఇవ్వాలని సూచించారు.

సింగపూర్ సహా వివిధ దేశాల్లో మంత్రుల అధ్యయన పర్యటనలపై కూడా చర్చ జరిగింది. వెళ్లడం మాత్రమే కాకుండా అక్కడి నూతన ఆవిష్కరణలను ఆకళింపు చేసుకోవాలని, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మంత్రులు, అధికారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఆధునిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

పాపులేషన్ మేనేజ్‌మెంట్
జనాభా నిర్వహణపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. వేసవిలో చలివేంద్రాల ఏర్పాటు, అవసరమైతే మజ్జిగ పంపిణీ చేయాలని సూచించారు. ప్రజలతో మమేకం అవుతూ ప్రాంతాల వారీగా సమస్యలను గుర్తించి పరిష్కరించాలని పునరుద్ఘాటించారు.

డీజిల్, పెట్రోల్ వంటి అంశాల్లో ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంటే దీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. విపక్ష ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇవ్వడంతో పాటు ప్రజలకు వాస్తవాలను వివరించాలని సూచించారు. ‘పిల్లలే సంపద’ పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయాలని మంత్రులతో చర్చించారు. ప్రతి మూడో బిడ్డకు ప్రత్యేక ప్రోత్సాహం, మూడు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలకు అన్ని పథకాలు వర్తింపజేయాలని నిర్ణయించారు. జూన్ నుంచి జనాభా నిర్వహణపై ప్రత్యేక ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు.

వేసవిలో సాగు, తాగునీరు, రిజర్వాయర్లు, చెరువులు, కాలువల నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సింగపూర్ పర్యటనకు వెళ్లిన మంత్రులు అక్కడి అనుభవాలను వివరించారు. వాటిని రాష్ట్రంలో ఎలా అమలు చేయాలనే దానిపై అచ్చెన్నాయుడు, నారాయణ, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, బీసీ జనార్థన్ రెడ్డి, వంగలపూడి అనితలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేలా పర్యటనలు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గతంలో కూడా ఇలాంటి అధ్యయన పర్యటనలు నిర్వహించామని గుర్తుచేశారు.

Leave a Reply