విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచిన స్మార్ట్ విధానం

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచిన స్మార్ట్ విధానం
అమరావతి, ఆంధ్రప్రభ: “పూను స్పర్ధలు విద్యలందే-వైరములు వాణిజ్యమందే” అని ఎలుగెత్తి చాటిన నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు మాటలను స్ఫూర్తిగా తీసుకున్న ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మిషన్‌కు శ్రీకారం చుట్టారు. విద్యా సంవత్సరం ఆరంభంలోనే రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధన కోసం నారా లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ 100 రోజుల ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయడంతో టెన్త్ ఉత్తమ ఫలితాలు వచ్చాయి. ఉత్తీర్ణతా శాతం మెరుగుపడింది. మంత్రి లోకేష్ 100 రోజుల ప్రణాళిక సూపర్ సక్సెస్ను తెచ్చిపెట్టింది.
100 రోజుల కార్యాచరణ ప్రణాళిక… రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో టెన్త్ విద్యార్థుల కోసం రూపొందించిన 100-రోజుల కార్యాచరణ ప్రణాళికను 06-12-2025 నుంచి 15-03-2026 పరీక్షల ఆరంభం అయ్యేవరకూ క్రమపద్ధతిలో అమలు చేశారు. ఈ కాలంలో విద్యార్థులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా 46 స్లిప్ టెస్టులు నిర్వహించారు. ఇందులో వచ్చిన మార్కులను లీప్ మొబైల్ యాప్‌లో పొందుపరిచారు. రోజువారీ డ్యాష్‌బోర్డ్ ద్వారా మార్కులను విశ్లేషించారు.
స్లిప్ టెస్టులలో విద్యార్థుల సామర్థ్యాలను డ్యాష్‌బోర్డ్ ద్వారా మదింపు చేసి షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్‌గా విద్యార్థులను గుర్తించారు. వారి సామర్థ్యాలకు అనుగుణంగా బోధించారు. సబ్జెక్టుల వారీగా సందేహాలను తీర్చే పద్ధతిని అవలంబించారు. సాధనమున పనులు సమకూరుదరలో అన్న వేమన మాట స్ఫూర్తిగా విద్యార్థులతో క్రమపద్ధతిలో చేయించిన సాధన వారిలో ఆత్మవిశ్వాసంను పెంచింది.
నిరంతర సాధన కోసం అవసరమైన మోడల్ పేపర్లు, ప్రశ్న బ్యాంకులు విద్యాశాఖ ప్రచురించి ఉచితంగా అందించింది. వీటి ద్వారా విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధులను చేశారు. విభిన్న సామర్థ్యాలు కలిగిన విద్యార్థుల సాధనకు నాన్-లాంగ్వేజ్ సబ్జెక్టుల కోసం ద్విభాషా (బైలింగ్వల్) ప్రశ్న బ్యాంకులు, మిర్రర్-ఇమేజ్ రూపంలో ప్రచురించి అందించారు. వీటిని ప్రాక్టీస్ చేసిన విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు.
ఏ ఒక్క అవకాశం జారవిడువకుండా… ఏ విద్యార్థి ఏ విషయంలో బలంగా ఉన్నాడు.. ఏ విషయంలో బలహీనంగా ఉన్నారో ముందుగానే డ్యాష్‌బోర్డ్ విశ్లేషణ పూర్తయ్యింది. దీనికి అనుగుణంగా పాఠశాలకు ఒక సెట్ చొప్పున 15 కార్యాచరణ ప్రణాళిక పుస్తకాలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేశారు.
స్లిప్ టెస్టుల్లో వెనుకబడిన విద్యార్థుల కోసం 30 రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ప్రత్యేకంగా నిర్వహించి, వారి పఠనా సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. విద్యార్థులలో పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి, ఫలితాలను పెంచడానికి ప్రీ-ఫైనల్, గ్రాండ్ టెస్టులు నిర్వహించారు.
ఇక రాష్ట్రంలో మొత్తం 12,089 స్కూళ్లు ఉండగా, ఇందులో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 6,785, ఎయిడెడ్ స్కూళ్లు 260, ప్రైవేటు స్కూళ్లు 5,044 ఉన్నాయి. వీటిలో సున్నా శాతం ఫలితాలు వచ్చిన పాఠశాలలు 16 మాత్రమే. మొత్తంగా చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో సున్నా ఫలితాలు వచ్చినవి కేవలం 5 మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ విద్య నాణ్యతకు ఈ ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఇది అందరి విజయం
మంత్రి నారా లోకేష్
ఐక్యమత్యం, అంకితభావంతో, ప్రణాళికాబద్ధంగా అంతా కలిసి పనిచేయడం వల్ల టెన్త్ మంచి ఫలితాలు సాధించామని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం లక్ష్యం మేరకు ఇంకా సాధించాల్సింది చాలా ఉందన్నారు. మన ప్రణాళికలు విజయవంతమై మంచి మార్కులు వచ్చాయని, ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, పిల్లల్లో నైతిక విలువలు పెంపు, సమగ్ర విద్యా వికాసానికి మరింత కృషి చేయాలన్నారు.
టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఫెయిలైన వారూ తక్కువ ప్రతిభ ఉన్నవారు కాదని, నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదని ధైర్యం నింపారు. ప్రయత్నమే తొలి విజయం అని, ఓటమి విజయానికి తొలి మెట్టు వంటిదని, పట్టుదలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.
