Petrol | బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు..

Petrol | బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు..
వాహనదారుల అవస్థలు
Petrol | హైదరాబాద్, ఆంధ్రప్రభ : నగరంలో మరోసారి ఇంధన కొరత నీడలు కమ్ముకున్నాయి. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. నగరంలోని పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులు మూతపడగా, తెరిచి ఉన్న చోట కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. ముఖ్యంగా డీజిల్ లభ్యత లేకపోవడంతో మెజారిటీ బంకుల వద్ద ‘డీజిల్ నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఉప్పల్, ఎల్బీనగర్, మెహదీపట్నం,కేపీహేచ్బీ వంటి కీలక ప్రాంతాల్లో పలు బంకులను నిర్వాహకులు పూర్తిగా మూసివేశారు.
కొన్ని బంకుల్లో కేవలం పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉందని, డీజిల్ రాక కోసం ఎదురుచూస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల వాహనదారుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పరిమితంగానే ఇంధనాన్ని విక్రయిస్తున్నారు. బంకులు మూతపడుతున్నాయనే వార్తలతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఫుల్ ట్యాంక్ చేయించుకోవడానికి జనం ఎగబడుతుండటంతో రద్దీ మరింత పెరుగుతోంది.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి సరఫరాలో జరుగుతున్న జాప్యం, రవాణా పరమైన ఇబ్బందులు ఈ పరిస్థితికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. అంతేకాకుండా, అంతర్జాతీయ పరిణామాలు, ఆయిల్ డీలర్లకు, కంపెనీలకు మధ్య ఉన్న కొన్ని చెల్లింపుల సమస్యల వల్ల కూడా ఈ కొరత ఏర్పడి ఉండవచ్చని సమాచారం.
