నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..

  • గ్రామస్తుల ప్రశంసలు అందుకున్న సర్పంచ్ కార్తీక్
  • 300 మీటర్ల నూతన పైప్‌లైన్ ఏర్పాటు,
  • ఎన్నో ఏళ్లుగా వేధించిన తాగునీటి సమస్యకు ముగింపు,
  • సర్పంచ్ కార్తీక్ సేవలను అభినందించిన గ్రామస్తులు

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని బెజ్జోరా గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న తాగునీటి సమస్యకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామ సర్పంచ్ మెస్ కార్తీక్ బాధ్యతలు చేపట్టిన అనంతరం గ్రామంలోని ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

అందులో భాగంగా తాగునీటి సమస్యను ప్రాధాన్యతగా తీసుకుని సుమారు 300 మీటర్ల మేర నూతన పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయించి గ్రామ ప్రజలకు తాగునీరు అందేలా చర్యలు చేపట్టారు. కొత్త పైప్‌లైన్ ఏర్పాటు కావడంతో ఇప్పటి వరకు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడిన అనేక కుటుంబాలకు ఉపశమనం లభించింది.

ఇకపై ప్రతి ఇంటికి సక్రమంగా తాగునీరు అందే అవకాశం ఏర్పడిందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.గ్రామ అభివృద్ధి కోసం మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాల మెరుగుదల వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న యువ సర్పంచ్ మెస్ కార్తీక్ సేవలను గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు ప్రశంసించారు.

ప్రజా సమస్యలను గుర్తించి వెంటనే స్పందిస్తూ పరిష్కరిస్తున్న సర్పంచ్‌కు గ్రామ ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ బెజ్జోర గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగిస్తానని ఈ సందర్భంగా సర్పంచ్ మెస్ కార్తీక్ తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం కూడా అవసరమని ఆయన కోరారు.