క్రషర్‌లో వ్యాన్ బోల్తా.. ఒకరి దుర్మరణం
- యాజమాన్యం స్పందించలేదని బంధువుల ధర్నా
ఇబ్రహీంపట్నం/కంచికచర్ల, ఆంధ్రప్రభ: దొనబండ వార్స్ స్టోన్ క్రషర్‌లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. క్రషర్ ప్రాంగణంలో వ్యాన్ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడిని ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అబ్బూరి రాంబాబుగా గుర్తించారు.

ప్రమాద సమాచారం అందుకున్న కంచికచర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నందిగామ మార్చురీకి తరలించారు.
అయితే ప్రమాదంపై క్రషర్ యాజమాన్యం స్పందించకపోవడంతో మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రషర్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

