Pawankalyan | ఢిల్లీలో జనసేన కీలక సమావేశం..
Pawankalyan | ఢిల్లీలో జనసేన కీలక సమావేశం..
కాంగ్రెస్ తీరుపై విమర్శలు
12 ఏళ్ల పోరాట ఫలితంగా అన్ని చట్టసభల్లో ప్రాతినిధ్యం సాధించాం
Pawankalyan | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: దేశ సమగ్రత, శ్రేయస్సే జనసేన పార్టీ ప్రధాన ఎజెండా అని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు ప్రతీకగా నిలిచిన గడ్డపై, రాజ్యాంగం పురుడు పోసుకున్న ప్రదేశంలో సమావేశం నిర్వహించడం ప్రత్యేకత అని పేర్కొన్నారు.
ఢిల్లీలో తన ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన కీలక సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జనసేన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కాలంలో ఎన్నో ఉద్యమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు చేశామని, క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజల పక్షాన నిలిచామని చెప్పారు.
పార్టీని ప్రారంభించినప్పుడు అధికారం వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఉందని, అయితే నేడు జనసేనకు రాజ్యసభ సహా వివిధ చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించిందని తెలిపారు. ప్రస్తుతం పార్టీకి 20 లక్షల మందికి పైగా సభ్యత్వం ఉందని వెల్లడించారు.
దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు తమ మనుగడ కోసం వ్యవహరిస్తున్నాయని పవన్ కల్యాణ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర విభజనను కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విధానంపైనే తనకు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ వైఖరిలో ఇప్పటికీ మార్పు రాలేదని ఆరోపించిన ఆయన, జనసేన సమావేశానికి అనుమతి ఇవ్వకపోవడం కూడా అదే ధోరణికి నిదర్శనమని విమర్శించారు.
