ఆత్మగౌరవానికి ప్రతీకగా ముద్రగడ పద్మనాభం

ఆత్మగౌరవానికి ప్రతీకగా ముద్రగడ పద్మనాభం

  • రాజకీయాల్లో పారదర్శకత, నిబద్ధతకు నిదర్శనం
  • కాపు రిజర్వేషన్ ఉద్యమానికి ప్రధాన సారథి
  • విమర్శలు, వివాదాలు, చివరి దశ రాజకీయ పరిణామాలు
  • గోదావరి జిల్లాల్లో కొనసాగుతున్న ముద్రగడ ప్రభావం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ప్రత్యేక అధ్యాయానికి నాయకత్వం వహించిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం. ఆయన అరుదైన వ్యక్తిత్వానికి రాష్ట్రంలో లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సమకాలిన రాజకీయ నాయకులతో పోలిస్తే ఆయన వైఖరి పూర్తి భిన్నం. ఆలోచనల్లో స్పష్టత ఆయన సొంతం. అనుకున్నది సాధించేందుకు ఎవరినైనా ఎదిరించే తత్వం. ఎంతటి నష్టానికైనా ఓర్చే గుణం ఆయన నైజం. ఆత్మగౌరవానికి అసలు, సిసలైన ప్రతీక పద్మనాభం. తన ఆత్మగౌరవ పరిరక్షణ కోసం మంత్రి పదవులను కూడా తృణప్రాయంగా వదిలేసుకున్నారు. ఉన్నత పదవులు కంటే కూడా తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, తనను నమ్ముకున్న వారి సమస్యల్ని తీర్చడమే పరమావధిగా భావించేవారు.

సుమారు ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఆయన పలు పార్టీలు మారారు. పలువురు నాయకుల పట్ల తన విశ్వాసాన్ని మార్చుకున్నారు. మధ్యలో సొంత పార్టీ కూడా పెట్టారు. ఏ పార్టీలోనూ సుదీర్ఘకాలం ఇమడలేక పోయారు. జనతా, తెలుగుదేశం, కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అయ్యారు. టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారు. టిడిపి తరపున ఒకసారి ఎంపీగా కూడా సేవలందించారు. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో సహజంగానే రాజకీయ శత్రువులను కూడా పెంచుకున్నారు. అనేక సందర్భాల్లో తీవ్ర విమర్శలకు లోనయ్యారు. కానీ ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయనపై ఏనాడూ నయాపైసా ఆర్థిక ఆరోపణ రాలేదు. ఏ ఎన్నికల్లోనూ ఆయన ఓటర్లకు మద్యం, నగదు పంపిణీ చేయలేదు.

వారెవరినీ ప్రలోభాలకు గురి చేయలేదు. ఎన్నికల కోసం ఆయన సొంత డబ్బులను ఏ రోజూ ఖర్చు చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులే ఆయనకు విరాళాలు పంపేవారు. ఎన్నికల అనంతరం తాను అందుకున్న విరాళాలతో పాటు ఎన్నికల కోసం తాను చేసిన ప్రయాణాల వంటి చిన్న చిన్న ఖర్చుల జాబితాతో శ్వేతపత్రాన్ని ప్రకటించేవారు. మిగిలిన సొమ్మును తిరిగి విరాళాలు ఇచ్చిన వారికే పంపేసేవారు. ఈ తరహా శ్వేతపత్రాల ప్రకటన విధానం ప్రస్తుత రాజకీయాల్లో భారత్లో ఎక్కడా కనిపించదు.

ఓ రాజకీయ నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా కంటే కూడా ముద్రగడ ఉద్యమ నాయకుడిగానే గుర్తింపు పొందారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఆయన ఉచ్చస్థితికి తీసుకెళ్లారు. ఇందుకోసం కిర్లంపూడి నుంచి తిరుపతి వరకు సైకిల్‌పై సుదీర్ఘ యాత్ర నిర్వహించారు. కిర్లంపూడిలో భార్యతో సహా ఆమరణదీక్ష నిర్వహించారు. కాపు రిజర్వేషన్ లక్ష్యం నెరవేరకపోయినా ఆ సామాజికవర్గానికి చెందిన విద్యార్థులకు ఉపకార వేతనాల జారీకి 1993లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని అందుకున్నారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ముందుకు ఉరికించారు.

2015 జనవరిలో తునిలో నిర్వహించిన కాపు గర్జన సభ హింసాత్మకంగా మారింది. కాపు కార్యకర్తలను ఆయన అదుపు చేయలేక పోయారు. నేరుగా ఓ ఎక్స్‌ప్రెస్ రైలుపై కార్యకర్తలు దాడులు చేశారు. రైలుకు నిప్పు అంటించారు. తునిలో రెండు పోలీస్ స్టేషన్లను దగ్ధం చేశారు. అక్కడ ఉన్న పలువాహనాలకు నిప్పు పెట్టారు. ఓ విధంగా ఉద్యమం ఆయన అదుపు తప్పింది. ఈ సంఘటనలకు సంబంధించి పలువురు కాపు నాయకులతో పాటు ఆయన కూడా కేసులను ఎదుర్కొన్నారు. సుదీర్ఘకాలం కోర్టుల చుట్టూ తిరిగారు.

ప్రభుత్వాలను విమర్శించడంలోనూ ఆయన మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శించేవారు. అలాగే ఓ లక్ష్యం కోసం నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో సాక్షాత్తు అగ్రనాయకులు వచ్చి బ్రతిమలాడినా విరమించేవారు కాదు. తన డిమాండ్ నెరవేరే వరకు పట్టుదల కొనసాగించేవారు.

అయితే జీవిత చరమాంకంలో ఆయన కొన్ని విమర్శలకు గురయ్యారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను ఓడిస్తానని శపథం చేశారు. పవన్ పోటీ చేసిన పిఠాపురంలోనే తిష్టవేసుకుని కూర్చున్నారు. ఆయన్ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానన్నారు. ఇదే ఆయన జీవితంలో అతిపెద్ద విమర్శలకు తావిచ్చింది. అలాగే చివరి దశలో సొంత కూతురే ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఇంట్లోనే తండ్రి తీరును బహిరంగంగా తప్పుబట్టారు. ఇలాంటి కొన్ని ఇబ్బందులున్నా అనుచరులు మాత్రం ఆయనకు ఏనాడూ దూరంకాలేదు. అప్పటికీ ఇప్పటికీ ముద్రగడ ఆలోచనలు ఎలా ఉన్నా ఆయన మాటనే శాసనంగా భావించే అభిమానులు గోదావరి జిల్లాల్లో కోకొల్లలుగా కనిపిస్తారు. కాకినాడ జిల్లాతో పాటు కోనసీమ జిల్లాలోనూ ఆయనకు అపారమైన అనుచరగణం ఇప్పటికీ కొనసాగుతోంది.

– స్వాతి ప్రసాద్