Pawan Kalyan Speech | జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ హెచ్చరికలు

Pawan Kalyan Speech | జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ హెచ్చరికలు

Pawan Kalyan Speech | పార్టీలో లీకులు, అంతర్గత శత్రువులపై అసహనం
అమిత్ షా భేటీపై వస్తున్న ప్రచారానికి కౌంటర్
సినిమాల కంటే ప్రజాసేవే ముఖ్యమన్న పవన్
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపు

Pawan Kalyan Speech | రాజమహేంద్రవరం, ఆంధ్రప్రభ బ్యూరో: “నేనూ మనిషినే.. నాకు కోపాలు, బాధలు, భావోద్వేగాలు ఉంటాయి. చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దు.. దేనికైనా ఓ హద్దు ఉంటుంది.. భరిస్తాం.. సహిస్తాం.. అవసరమైతే తాట తీస్తాం” అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

సోమవారం రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా ఆయన పార్లమెంటు నియోజకవర్గ పార్టీ సమావేశంలో మాట్లాడారు. పవన్ తన ప్రసంగంలో జనసేనతో పాటు మిత్రపక్షం బీజేపీ నాయకులపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. జనసేన పార్టీపై రాళ్లు వేస్తామని బెదిరిస్తే ఊరుకోబోనని, రెచ్చగొట్టవద్దని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పార్టీలోనే శత్రువులు ఉన్నారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన విషయాలు బయటివారికి ఎలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు.

అమిత్ షాను కలిసినప్పుడు తాను వైసీపీ నేతలను అరెస్ట్ చేయించాలని కోరినట్టు జరుగుతోన్న ప్రచారంపై పవన్ ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో ఏపీ బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కొందరు నాయకులు పదవులు రాగానే మెత్తబడిపోయారని అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రితో రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడుతామని, ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం వ్యవస్థను అవమానించడమేనని పవన్ మండిపడ్డారు.

అమిత్ షాను కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే కలిశానని పవన్ స్పష్టం చేశారు. ఈ సమయంలో తనపై చేస్తున్న విమర్శలకు పవన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తాను అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని, బలమైన శత్రువులనే ఎదుర్కొంటానని, బలహీనులను కాదని ఉద్ఘాటించారు. అదే సమయంలో సొంత పార్టీ నేతలకు కూడా పవన్ గట్టి క్లాస్ పీకారు. శత్రువులు ఎక్కడో లేరని, మన పార్టీలోనే ఉన్నారని వ్యాఖ్యానించారు.

జనసేనలోనూ అనేక అంశాలపై లీకులు ఇస్తున్న వాళ్లు ఉన్నారని.. ఉండగలిగేవాళ్లే పార్టీలో ఉండాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నలిగి నలిగి ఉన్నామని, ఇకపై అలా కుదరదని.. ఇకపై జనసేన కట్టుదిట్టంగా ఉంటుందని చెప్పారు. శత్రువు బలంగా ఉన్నప్పుడే తాము బలంగా కొడతామన్నారు. వ్యక్తిగతంగా విమర్శిస్తే అంతే స్థాయిలో తిరిగిస్తానని హెచ్చరించారు.

తమిళనాడు రాజకీయాలపై మాట్లాడుతూ అక్కడ ఎన్నికలు ఎంతో సాఫీగా జరిగాయన్నారు. తనకు అసూయ కలిగేంత సుఖంగా సాగాయన్నారు. అక్కడ కటౌట్లు, హలోగ్రామ్ పెట్టుకుని గెలిచేసి సీఎంలు అయ్యారన్నారు. తనను మాత్రం 15 ఏళ్లు రోడ్డు మీద దేకించారని.. ఈ స్థాయికి రావడానికి 12 ఏళ్లు పట్టిందని.. రాజకీయ పార్టీ నడపడం అంత ఈజీ కాదని వ్యాఖ్యానించారు.

“నాకు కూడా సూపర్ స్టార్‌డమ్ ఉంది. ఇండస్ట్రీలో నా రేంజ్ ఏంటో నాకు తెలుసు. నేను అనుకుంటే ఇప్పటికీ ఓజీ లాంటి భారీ యాక్షన్ సినిమాలు మరెన్నో చేయగలను, బాక్సాఫీస్ రికార్డులు సృష్టించగలను. కానీ, నాకు గ్లామర్ ప్రపంచం కంటే ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే అత్యంత ఇష్టమైన పని. కేవలం వెండితెరపై హీరోగా కనిపించడం కంటే నిజ జీవితంలో ప్రజల కష్టాలు తీర్చడమే తనకు తృప్తినిస్తుందని పవన్ చెప్పారు.

సినిమా అవార్డుల కంటే ప్రజల మొహాల్లో చూసే నవ్వే తనకు గొప్ప గుర్తింపునిస్తుంది. సినిమాల్లో నటించి ఆస్కార్ అవార్డు సాధించడం నాకు ముఖ్యం కాదు. 70 ఏళ్లుగా సరైన రోడ్డు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్న ఒక మారుమూల గ్రామానికి, మేము అధికారంలోకి వచ్చాక రోడ్డు వేయించగలిగితే, ఆ రోజు నాకు ఆస్కార్ అవార్డు కొట్టినంత ఆనందం కలుగుతుంది” అని అన్నారు.

ఒకరు జైలు కెళితే తనకు అధికారం వస్తుందని ఆశించే మనస్తత్వం తనది కాదన్నారు. అలాగైతే తాను కూటమి ఏర్పాటుకు ముందుకొచ్చే వాడినే కాదని స్పష్టం చేశారు. జనసేన పార్టీని ఓ సైద్ధాంతిక పునాదులపై నిర్మిస్తున్నానన్నారు. దీర్ఘకాల రాష్ట్ర భవిష్యత్తే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానన్నారు. పార్టీ కోసమో లేక తన పదవుల కోసమో తాను పొత్తులు పెట్టుకోలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే పొత్తుకు సిద్ధమయ్యానన్నారు.

స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి

ఏ రాజకీయ పార్టీకైనా స్థానిక ఎన్నికలే కీలకం. క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణకు అది అవకాశం కల్పిస్తుంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. తదుపరి పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతాయి. ఇందులో పోటీకి సమర్థులైన నాయకుల్ని ఎంపిక చేసి సిద్ధంగా ఉంచండని శ్రేణులకు పవన్ కళ్యాణ్ సూచించారు. కార్పొరేషన్లు, పురపాలక సంఘాల్లో గుర్తింపు ప్రక్రియను వేగంగా చేపట్టాలన్నారు.

Leave a Reply