Paddy Bonus | ఈ 7 రకాలకే క్వింటాకు రూ.500 అదనం
వానాకాలం-2026 నుంచి పారదర్శక విధానం అమలు..
విత్తనాల కొనుగోలు వివరాల ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి
ప్రభుత్వం గుర్తించిన సన్న వరి రకాలనే సాగు చేయాలని రైతులకు వ్యవసాయ శాఖ సూచన
Paddy Bonus | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : సన్న వడ్లు సాగు చేసే రైతులకు బోనస్ చెల్లింపుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 వానాకాలం (ఖరీఫ్) సీజన్ నుంచి క్వింటాకు రూ.500 బోనస్ అమలుకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వం గుర్తించిన సన్న వరి రకాలు సాగు చేసిన రైతులకే బోనస్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
సన్న వడ్ల బోనస్ పథకం అమలులో పూర్తి పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. విత్తనాల విక్రయం నుంచి రైతులు ధాన్యం విక్రయించే వరకు ప్రతి దశను ఆన్‌లైన్‌లో నమోదు చేసే విధానాన్ని అమలు చేయనుంది. దీంతో అక్రమాలు, తప్పుడు నమోదులు, అనర్హులకు బోనస్ చెల్లింపులు వంటి సమస్యలను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త నిబంధనల ప్రకారం రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత విత్తనాల డీలర్లు కొనుగోలు వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో లేదా ప్రత్యేక వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. రైతు పేరు, సాగు చేసే సన్న వరి రకం, ఇతర అవసరమైన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కావడం తప్పనిసరి. అలాగే, గుర్తింపు పొందిన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయని రైతులకు కూడా ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది. వారు సాగు చేస్తున్న సన్న వరి రకం వివరాలను అధికారిక విధానంలో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో అర్హులైన రైతులు బోనస్‌కు దూరం కాకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బోనస్‌కు అర్హత ఉన్న సన్న వరి రకాలు :
ప్రభుత్వం నిర్దేశించిన ఈ ఏడు సన్న వరి రకాల సాగుకు మాత్రమే క్వింటాకు రూ.500 బోనస్ వర్తిస్తుంది.
బీపీటీ–5204 (సాంబ మసూరి)
ఆర్‌ఎన్‌ఆర్–15048 (తెలంగాణ సోనా)
హెచ్‌ఎంటీ సోనా
జై శ్రీరామ్
కేఎన్‌ఎం–1638 (కూనారం సన్నలు)
డబ్ల్యూజీఎల్–44 (సిద్ధి)
కేఎన్‌ఎం–7715
వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఒక కీలక సూచన చేశారు. బోనస్ ప్రయోజనం పొందాలంటే ప్రభుత్వం గుర్తించిన ఈ రకాలనే సాగు చేయాలని, ఇతర రకాల వరి సాగు చేస్తే బోనస్ వర్తించదని స్పష్టం చేశారు. అలాగే విత్తనాల కొనుగోలు, నమోదు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత వ్యవసాయ అధికారులు, విత్తనాల డీలర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ కొత్త విధానంతో సన్న వడ్ల బోనస్ చెల్లింపులు మరింత పారదర్శకంగా సాగడంతో పాటు నిజమైన అర్హులైన రైతులకే ప్రభుత్వ ప్రోత్సాహకం చేరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
