తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వెల్ది గ్రామానికి బాడీ ఫ్రీజర్ విరాళం

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : మనిషి జీవితం ముగిసే చివరి ఘట్టంలోనూ కుటుంబాలకు అండగా నిలిచేలా చేసిన ఓ దాతృత్వ కార్యక్రమం వెల్ది గ్రామంలో ఆదర్శంగా నిలిచింది. రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామానికి చెందిన ఆరేళ్ల నరసయ్య తల్లిదండ్రులు ఆగమ్మ – మంగయ్య చిరస్మరణీయ జ్ఞాపకార్థం గ్రామానికి బాడీ ఫ్రీజర్‌ను విరాళంగా అందించారు.

ఈ కార్యక్రమంలో కోడలు ఉపేంద్ర కూడా భాగస్వాములయ్యారు. గ్రామంలో ఎవరైనా మరణించినప్పుడు మృతదేహాన్ని భద్రంగా ఉంచేందుకు బాడీ ఫ్రీజర్ ఎంతో అవసరమని, ఆఅవసరాన్ని గుర్తించిన నరసయ్య కుటుంబం ఈవిలువైన సేవా కార్యక్రమాన్ని చేపట్టడం గ్రామ ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సింగిరెడ్డి సునీత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తల్లిదండ్రుల పేరును చిరస్థాయిగా నిలిపేలా గ్రామానికి ఉపయోగపడే బాడీ ఫ్రీజర్‌ను అందించడం అభినందనీయమని అన్నారు.

గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున ఆరేళ్ల నరసయ్య, ఉపేంద్ర దంపతులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి సేవా స్ఫూర్తి మరెందరికో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.