Gummadi Sandhyarani | జగన్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం..

మంత్రి గుమ్మడి సంధ్యారాణి
ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమే..
విశాఖ రాజధాని అంశంపై వైసీపీ అధినేతపై మంత్రి తీవ్ర విమర్శలు
ప్రజలు ఇప్పటికే జగన్ మాటలను తిరస్కరించారు..
మళ్లీ అదే రాజకీయాలు సాగవన్న మంత్రి

Gummadi Sandhyarani |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన అంశాలనే మళ్లీ ప్రస్తావిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పలు రాజకీయ అంశాలపై స్పందించారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలకు నిలకడ లేదని, ఆయన మాటలు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయాయని అన్నారు.

విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తామని చెప్పి గత ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లినప్పటికీ, ఆ ప్రాంత ప్రజల నుంచే ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని ఆమె పేర్కొన్నారు. దీంతో జగన్ హామీలను ప్రజలు విశ్వసించడం లేదనే విషయం స్పష్టమైందని వ్యాఖ్యానించారు. వైసీపీలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ, జగన్ చేస్తున్న వ్యాఖ్యల వల్ల పార్టీకి కలుగుతున్న నష్టాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారో అర్థం కావడం లేదని సంధ్యారాణి అన్నారు.

అలాగే కుటుంబ వ్యవహారాలను ప్రస్తావిస్తూ, సొంత కుటుంబ సభ్యులతో వ్యవహరించిన తీరు, ఇతర అంశాల్లో తీసుకున్న నిర్ణయాలను కూడా ఆమె విమర్శించారు. బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. జగన్ తాజా రాజకీయ వ్యాఖ్యలు ప్రజలను గందరగోళానికి గురిచేసేలా ఉన్నాయని, అవి ప్రజా సమస్యల పరిష్కారంపై కాకుండా రాజకీయ విమర్శలకే పరిమితమయ్యాయని మంత్రి అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచైనా వైసీపీ నాయకత్వం పాఠాలు నేర్చుకోవాలని సూచించారు.

వైసీపీ మేనిఫెస్టో, రాజకీయ విధానాలపైనే ప్రజలు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారని, అదే ధోరణిని కొనసాగిస్తే భవిష్యత్తులో పార్టీకి మరింత రాజకీయ నష్టం తప్పదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్యానించారు.