బంతి బంతికీ బెట్టింగ్…

బంతి బంతికీ బెట్టింగ్…
కర్నూలు జిల్లాలో కుటుంబాల్ని కుదేలుచేస్తున్న ఆన్లైన్ క్రికెట్ మాఫియా…
కర్నూలు. బ్యూరో, ఆంధ్రప్రభ : ఐపీఎల్ సీజన్ ప్రారంభమైతే చాలు…కర్నూలు జిల్లాలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ దందా మళ్లీ చెలరేగుతోంది. బంతి బంతికీ సిక్స్, ఓవర్‌కు పరుగులు, ఆటగాళ్ల ప్రదర్శనలపై ముందస్తు అంచనాలతో నడిచే ఈ అక్రమ వ్యాపారం యువతను ఆకర్షిస్తూ, చివరకు అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. “ఒక్కసారి గెలిస్తే చాలు” అన్న ఆశతో ప్రారంభమయ్యే ఈ పందేలు. అనేక కుటుంబాలను ఆర్థికంగా కుదేలుచేస్తున్నాయి. ఎమ్మిగనూరులో తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన ఈ దందా విస్తృతిని స్పష్టంగా చూపించింది.
స్పెషల్ బ్రాంచ్ పోలీసుల పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ భార్గవి తెలిపారు. ఎమ్మిగనూరు, ఆదోని, సిరిగుప్ప (కర్ణాటక), పెద్దటుంబళం ప్రాంతాలకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ప్రత్యేక యాప్ ఏర్పాటు చేసి ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. వారి వద్ద నుంచి రూ.22 లక్షల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
మరో ఇద్దరు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇదే తరహాలో ఆదోని ప్రాంతంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన మరో కేసులో ఇస్మాయిల్, బోయి మహానంది, బోయి రమేష్, ఎస్.రాజేష్, చుండి శ్రీనివాసరావు, అడ్డాల కళ్యాణ్, రఘు ఆచారి తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. “ఎక్స్చేంజ్” పేరుతో నడిచే యాప్‌ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తూ రూ.91 లక్షల నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ బెట్టింగ్ వ్యవస్థ పూర్తిగా డిజిటల్ రూపంలో సాగుతోంది. ఒక్కో బంతిపై పందేలు, ఓవర్‌కు స్కోర్ అంచనాలు, ఫోర్, సిక్స్, వైడ్, నోబాల్ వంటి ప్రతి చిన్న అంశంపైనా బెట్టింగ్ జరుగుతోంది.
టెలిగ్రామ్, వాట్సాప్ గోప్య గ్రూపుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ, UPIల ద్వారా నిమిషాల్లో డబ్బు మార్పిడి జరుగుతోంది. ఈ దందాకు ప్రధానంగా బలవుతున్న వారు యువత, విద్యార్థులే. చిన్న మొత్తాలతో ప్రారంభించిన పందేలు కొద్దికాలంలోనే లక్షల్లో అప్పులుగా మారుతున్నాయి. “ఇంకోసారి గెలిస్తే అప్పు తీర్చేస్తా” అన్న భావనతో మరింత లోతుకు వెళ్లి చివరకు ఆర్థికంగా కుదేలవుతున్నారు. పోలీసు వర్గాల ప్రకారం, బెట్టింగ్ అప్పుల ఒత్తిడితో కొందరు యువకులు మానసికంగా కుంగిపోతున్నారు.
కుటుంబ సభ్యుల ఒత్తిడి, అప్పుదారుల వేధింపులు కలిసి తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. అప్పులు తీర్చేందుకు కొందరు యువకులు గొలుసు దొంగతనాలు, చిన్నపాటి దోపిడీలకు పాల్పడిన ఘటనలు కూడా నమోదవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ ఆన్లైన్ బెట్టింగ్‌పై కఠిన చర్యలు ప్రారంభించింది. స్పెషల్ బ్రాంచ్ నిఘా పెంచి, సైబర్ సర్వైలెన్స్ ద్వారా బెట్టింగ్ యాప్‌లను గుర్తించి దాడులు నిర్వహిస్తున్నారు.
బెట్టింగ్ నిర్వహించే వారితో పాటు పాల్గొనే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిపుణులు చెబుతున్నది ఒక్కటే-త్వరగా డబ్బు సంపాదించాలన్న ఆశే పెద్ద మోసం. క్రికెట్ వినోదంగా ఉండాలి. జీవితాలను నాశనం చేసే బెట్టింగ్‌గా మారకూడదు.
బంతి బంతికీ ఉత్కంఠ కాదు…
జీవితాన్నే పణంగా పెట్టే ప్రమాదకర ఆటగా మారుతోంది.
