సీబీఐ వలలో ఇబ్రహీంపట్నం సీజీఎస్టీ అధికారిణి బానోతు మంగమ్మ

  • రూ.50 వేల లంచం తీసుకుంటూ సీజీఎస్టీ సూపరింటెండెంట్‌ అరెస్ట్‌
  • పన్ను బకాయిల వ్యవహారంలో రూ.1.50 లక్షలు డిమాండ్‌
  • నోటీసు ఇవ్వకుండా ఉండేందుకు లంచం అడిగినట్లు ఆరోపణ
  • మిగిలిన రూ.లక్ష చెల్లించాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం
  • లంచం స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సీబీఐ

ఇబ్రహీంపట్నం ఆంధ్రప్రభ : పన్ను బకాయిలకు సంబంధించి నోటీసు జారీ చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్‌ చేసిన ఇబ్రహీంపట్నం సీజీఎస్టీ సూపరింటెండెంట్‌ బానోతు మంగమ్మను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. రూ.1.50 లక్షలు లంచంగా డిమాండ్‌ చేసిన ఆమె.. తొలి విడతగా రూ.50 వేలు స్వీకరిస్తుండగా సీబీఐ వలలో చిక్కినట్లు సమాచారం.

పన్ను బకాయిలకు సంబంధించి నోటీసు జారీ చేయకుండా ఉండేందుకు సూపరింటెండెంట్‌ రూ.1.50 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై అందిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు రంగంలోకి దిగి నిఘా పెట్టారు. పథకం ప్రకారం రూ.50 వేల లంచం తీసుకుంటుండగా మంగమ్మను అధికారులు పట్టుకున్నట్లు తెలిసింది.

ఈ ఘటనతో ఇబ్రహీంపట్నం సీజీఎస్టీ కార్యాలయంలో కలకలం రేగింది. లంచం డిమాండ్‌, స్వీకరణకు సంబంధించి సీబీఐ అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.