Bandi | ఓ యువ‌తా… రాజ‌కీయాల్లోకి రా!

Bandi | ఓ యువ‌తా… రాజ‌కీయాల్లోకి రా!

మీ రాక‌తో వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు బ్రేక్‌!
కేంద్ర‌ మంత్రి బండి సంజ‌య్ మేల్కోలుపు


Bandi | క‌రీంన‌గ‌ర్‌, ఆంధ్ర‌ప్ర‌భ : నేటి యువ‌త రాజ‌కీయాల్లోకి రావాల‌ని, మీ రాక‌తో వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు బ్రేక్ ప‌డుతుంద‌ని కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ (Bandi Sanjay Kumar) అన్నారు. యువత రాజకీయాల్లోకి రాకుంటే దేశాన్ని కుటుంబ వారసత్వ రాజకీయాలు పట్టి పీడించే ప్రమాదముందని, ఇది దేశానికి మంచి ప‌రిణామం కాద‌న్నారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జ‌యంత్యుత్స‌వాల సంద‌ర్భ‌గా ఈ రోజు కరీంనగర్ లో పాద‌యాత్ర నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు, యువత హాజరై సంజ‌య్ తోపాటు నడిచారు.

అంతకుముందు పాదయాత్ర ఆరంభంలో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు (Teacher, Graduate MLCs) మల్క కొమరయ్య, అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. వారసత్వ రాజకీయాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర వ్యతిరేకమన్నారు. ప్రపంచంలో నెలకొన్న పోటీ, ఎదురవుతున్న సవాళ్లను భారత్ అధిగమించాలంటే తప్పనిసరిగా యువత రాజకీయాల్లోకి (politics) రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఆపరేషన్ పోలో’ (అంటే పోలీస్ యాక్షన్) పేరుతో నిజాం కుట్రలను భగ్నం చేసి తెలంగాణకు విముక్తి కల్పించిన సర్దార్ పటేల్ మనందరికీ ఆరాధ్యుడన్నారు. దేశంలో ఆధునిక సివిల్ సర్వీసెస్ (IAS, IPS) వ్యవస్థను స్థాపించడంలో పటేల్ కీలక పాత్ర పోషించార‌ని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్టోబర్ 31 నుండి నవంబర్ 25 వరకు ‘‘సర్దార్@150 ఐక్యతా మార్చ్’’ పేరిట అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌యవంతం చేయాల‌ని కోరారు.


సౌదీ అరేబియా (Saudi Arabia) లో జరిగిన బస్సు ఘోర ప్రమాదంలో 42 మంది భారతీయులు మరణించినట్లు సమాచారం తెలిసి తీవ్ర దిగ్బ్రాంతికి గురైన‌ని బండి సంజ‌య్ కుమార్ అన్నారు. అందులో 18 మంది తెలుగు వాళ్లు కూడా ఉన్నట్లు తెలిసింద‌న్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే సౌదీ ప్రభుత్వంతో మాట్లాడుతున్నార‌ని తెలిపారు. ఆ కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామ‌న్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందిస్తామ‌ని చెప్పారు. మరణించిన కుటుంబాలకు త‌న‌ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామ‌న్నారు. మృతుల‌ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నా అని అన్నారు.

Leave a Reply