బెల్లంపల్లిలో ఇప్పటికీ ఏర్పాటుకాని ‘డీఎల్పీఓ’ కార్యాలయం!
- 11 ఏళ్లుగా ఒకే ఒక్క అధికారి.. సిబ్బందిని నియమించని ప్రభుత్వం
- మంచిర్యాల నుంచే బెల్లంపల్లి డివిజన్ పాలన
- ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యంపై ప్రజల మండిపాటు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే 2016-17లో బెల్లంపల్లికి డివిజనల్ పంచాయతీ అధికారి (డీఎల్పీఓ) కార్యాలయాన్ని మంజూరు చేసింది. అయితే, కార్యాలయం మంజూరై 11 ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ బెల్లంపల్లి పట్టణంలో డీఎల్పీఓ కార్యాలయం ఏర్పాటు కాకపోవడం గమనార్హం. ఇందుకు కారణం ప్రభుత్వం ఈ కార్యాలయానికి కావాల్సిన క్యాడర్ స్ట్రెంత్ (సిబ్బంది)ని నియమించకపోవడమేనని తెలుస్తోంది.
కేవలం ఒక్క డివిజనల్ పంచాయతీ అధికారి పోస్టును మాత్రమే క్రియేట్ చేసి వదిలేయడంతో.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన డీఎల్పీఓలు జిల్లా కేంద్రమైన మంచిర్యాలలోని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) కార్యాలయం నుంచే బెల్లంపల్లి డివిజన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బెల్లంపల్లిలో డీఎల్పీఓ కార్యాలయం ఏర్పాటు కొరకు అటు జిల్లా పంచాయతీ అధికారితో పాటు, స్థానిక డీఎల్పీఓ, స్థానిక ప్రజాప్రతినిధులు ఎలాంటి కృషి చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రజలు మండిపడుతున్నారు. కొత్త కార్యాలయానికి కావలసిన సిబ్బందిని తెప్పించే విషయమై ఎమ్మెల్యే, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా కలెక్టర్ పట్టింపులేనట్లు వ్యవహరిస్తూ బెల్లంపల్లి డివిజన్‌పై వివక్ష చూపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మంచిర్యాల నుంచే విధులు..
డీఎల్పీఓలు జిల్లా కేంద్రం నుంచే విధులు నిర్వర్తిస్తుండటంతో అసలు బెల్లంపల్లి డివిజన్‌కు డీఎల్పీఓ ఉన్నారా? లేదా? అనే విషయం ప్రజలకు ప్రశ్నార్థకంగా మారింది. అదే బెల్లంపల్లిలో డీఎల్పీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, తగు సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తే అధికారికి దూరభారం తప్పడంతో పాటు, స్థానికంగా ఉండి డివిజన్ పరిధిలోని గ్రామాల్లో నిరంతరం పర్యటించే వీలుంటుంది.
తద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, పంచాయతీ సిబ్బంది విధుల పర్యవేక్షణ సవ్యంగా సాగుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి వెంటనే స్పందించి బెల్లంపల్లిలో డీఎల్పీఓ కార్యాలయ స్థాపనకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. తగు సిబ్బందిని నియమించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రితో స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, జిల్లా మంత్రి గడ్డం వివేకానందలు మాట్లాడి కృషి చేయాలని బెల్లంపల్లి డివిజన్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
