‘ఛాత్రోన్ కీ గూంజ్’ ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు..
- నిరుద్యోగం, ప్రశ్నపత్రాల లీకేజీలపై విద్యార్థులతో కలిసి నిరసన
ఉమ్మడి వరంగల్ బ్యూరో, ఆంధ్రప్రభ : టీపీసీసీ ఆదేశాల మేరకు, పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రారంభించిన ‘ఛాత్రోన్ కీ గూంజ్’ ఉద్యమానికి మద్దతుగా వరంగల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎం.డి. అయూబ్ మాట్లాడుతూ, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, తరచూ జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, నియామక ప్రక్రియల్లో జాప్యాలు లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

నీట్ (NEET) పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందని విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుంటే, పేపర్ లీకేజీల కారణంగా వారి శ్రమ వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం బాధాకరమన్నారు. “యువత గొంతుకే దేశ భవిష్యత్తు.. ‘ఛాత్రోన్ కీ గూంజ్’ ఉద్యమాన్ని విజయవంతం చేయాలి” అని అయూబ్ పిలుపునిచ్చారు.
