పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా…
- బాబు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా..
- డెయిరీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేశా
- హెరిటేజ్ విస్తరణ కోసం విజయ డెయిరీని బలహీనపరుస్తున్నారన్న ప్రచారం అవాస్తవం
- రూ.200 కోట్లతో కొత్త ప్లాంట్.. ఏడాదికి మూడుసార్లు రైతులకు బోనస్‌లు
- కుటుంబ సభ్యులను బెదిరించారన్న ఆరోపణలు అవాస్తవం..
- పార్టీ నిర్ణయంపై ఎలాంటి సందేహాలు లేవు
- కృష్ణ మిల్క్ యూనియన్ మాజీ చైర్మన్ చలసాని ఆంజనేయులు..
(విజయవాడ, ఆంధ్రప్రభ) : విజయ డెయిరీ నాయకత్వాన్ని మార్చాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిందని, పార్టీ తీసుకున్న నిర్ణయానికి తాను పూర్తిగా కట్టుబడి ఉంటానని కృష్ణ మిల్క్ యూనియన్ మాజీ చైర్మన్ చలసాని ఆంజనేయులు స్పష్టం చేశారు. సమాచారం లోపం కారణంగానే కొంత గందరగోళం ఏర్పడిందని తెలిపారు. తనకు అప్పగించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని, విజయ డెయిరీని వీలైనంత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఈ బాధ్యత అప్పగించారని చెప్పారు.
పార్టీ దూతలు గానే…
తన రాజీనామా కోసం వచ్చిన మంత్రులను కేవలం మంత్రులుగా చూడలేదని, వారిని తెలుగుదేశం పార్టీ దూతలుగానే భావించానని చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. పార్టీ నిర్ణయాలపై తనకు ఎలాంటి సందేహాలు, అనుమానాలు లేవని, పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. నాయకత్వ మార్పు విషయంలో అనవసర గందరగోళం వద్దని, పార్టీ నిర్ణయమే తుది నిర్ణయమని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది.
హెరిటేజ్ పై ఆరోపణల అవాస్తవం…
హెరిటేజ్‌ను విస్తరించేందుకు విజయ డెయిరీని బలహీనపరుస్తున్నారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని చలసాని ఆంజనేయులు ఖండించారు. విజయ డెయిరీని బలహీనపరిచే ఆలోచన ప్రభుత్వానికి గానీ, పార్టీకి గానీ లేదని తెలిపారు. విజయ డెయిరీని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సంస్థ అభివృద్ధి, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగామని చెప్పారు.
ఎన్నో అభివృద్ధి పనులు…
తన పదవీకాలంలో విజయ డెయిరీ అభివృద్ధికి తీసుకున్న చర్యలను మాజీ చైర్మన్ చలసాని ఆంజనేయులు వివరించారు. రూ.200 కోట్లతో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేశామని తెలిపారు. రైతుల సంక్షేమానికి విశేషంగా కృషి చేశామని, ఏడాదికి మూడుసార్లు బోనస్‌లు అందించామని చెప్పారు. తనకు అప్పగించిన బాధ్యతను పూర్తిస్థాయిలో వినియోగించుకుని సంస్థను అభివృద్ధి చేసేందుకు కృషి చేశానని పేర్కొన్నారు.
బెదిరింపు ప్రచారం వాస్తవం…
తన కుటుంబ సభ్యులను బెదిరించారంటూ వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని చలసాని ఆంజనేయులు స్పష్టం చేశారు. అవి అవాస్తవ ప్రచారమేనని కొట్టిపారేశారు. విజయ డెయిరీని బలహీనపరిచే ఉద్దేశం ఎవరికీ లేదని, సంస్థను మరింత పటిష్టం చేయడమే ప్రభుత్వ, పార్టీ లక్ష్యమని తెలిపారు. విజయ డెయిరీ నాయకత్వ మార్పు విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతానని చలసాని ఆంజనేయులు స్పష్టం చేశారు. తనకు అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ, అప్పగించిన బాధ్యతను సద్వినియోగం చేసుకున్నానని తెలిపారు. నాయకత్వ మార్పుపై తనకు ఎలాంటి సందేహాలు, అనుమానాలు లేవని, పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని వెల్లడించారు.
