హైదరాబాద్ – జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్ల బంద్ అంటూ ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం వివాదాస్పందంగా మారిపోయింది.. సినీ పరిశ్రమకు సంబంధించిన ఏ సమస్యలు అయినా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న సమయంలో.. ఎలాంటి చర్చలు లేకుండా థియేటర్ల బంద్‌పై ఎలా నిర్ణయం తీసుకున్నారనే చర్చ మొదలైంది.. అంతేకాదు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు లాంటి సినిమాలు వచ్చే సమయంలో నిర్ణయం ఏంటి? అంటూ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ప్రశ్నించారు.. అంతేకాదు.. ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారు..? ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలంటూ ఆదేశాలు జారీ చేశారు.. ఈ నేపథ్యంలో థియేటర్ల బంద్‌పై వెనక్కి తగ్గారు ఎగ్జిబిటర్లు..
హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఆల్ సెక్టార్స్ మీటింగ్ నేడు జరిగింది.. ఈ సమావేశానికి దిల్ రాజు, సునీల్ నారంగ్, మైత్రీ రవి శంకర్, చదలవాడ శ్రీనివాసరావు, సితార నాగ వంశీ, బెల్లంకొండ సురేష్, రాధ మోహన్, స్రవంతి రవికిశోర్, బాపినీడు, ఏఎం రత్నం, సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు..
జూన్ 1 నుంచి తలపెట్టిన థియేటర్ల బంద్‌పై చర్చించారు.. ఆ తర్వాత ఓ కీలక ప్రకటన విడుల చేసింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్.. జూన్ 1వ తేదీ నుండి సినిమా థియేటర్ల బంద్ లేదని స్పష్టం చేసింది.. యథావిథిగా సినిమాల ప్రదర్శన కొనసాగుతుందని పేర్కొంది.. ఆల్ సెక్టార్స్ మీటింగ్ తర్వాత అందరూ కలిసి తీసుకొన్న నిర్ణయం ఇది అని ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ తెలియజేసారు.. అంతేకాదు, మా సమస్యలను తామే పరిష్కరించుకుంటాం.. ఈ సమస్యలపై ఈ నెల 30వ తేదీన కమిటీ వేస్తున్నాం.. త్వరలోనే అందరికి అనువుగా ఉండే నిర్ణయాలు తీసుకొంటాం అని పేర్కొంది ఫిల్మ్ ఛాంబర్..