బార్‌లో పరిచయం.. బంగారు ఆభరణాల చోరీ..
నిందితుడు అరెస్ట్
నర్సాపురం, ఆంధ్రప్రభ: నర్సాపురంలోని ఓ బార్‌లో పరిచయమైన వ్యక్తి మద్యం మత్తులో ఉన్న మరో వ్యక్తి బ్యాగ్‌లోని రూ.1.70 లక్షల విలువైన రెండు కాసుల బంగారు ఆభరణాలను అపహరించిన ఘటనను పట్టణ పోలీసులు రెండు రోజుల్లోనే ఛేదించారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఆరుగట్లపాలెంకు చెందిన పాలేపు దుర్గాప్రసాద్ (23)ను నర్సాపురంలోని పిల్లిపేట చర్చి సమీపంలో అరెస్ట్ చేశారు. బాధితుడు చీదే ముత్యాలరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సాంకేతిక ఆధారాలు, పోలీసుల లెగ్‌వర్క్‌తో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచనలతో, నర్సాపురం డీఎస్పీ సుధాకర్‌రావు ఆదేశాల మేరకు సీఐ ఆకుల రఘు, ఎస్‌ఐ పి. ప్రేమ్‌రాజు నేతృత్వంలోని ప్రత్యేక బృందం కేసును ఛేదించింది. కేసును త్వరితగతిన పరిష్కరించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ, డీఎస్పీ అభినందించారు. ప్రయాణాల సమయంలో విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని, అపరిచితులను నమ్మవద్దని, వారితో స్నేహం చేయవద్దని సీఐ ఆకుల రఘు సూచించారు.
