తెలంగాణకు కెసిఆర్ నాయకత్వం శ్రీరామరక్ష

తెలంగాణకు కెసిఆర్ నాయకత్వం శ్రీరామరక్ష

  • వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపూనేని

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్ : తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే, గ్రేటర్ వరంగల్ తొలి మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వరంగల్ జిల్లా కార్యాలయంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నన్నపునేని నరేందర్ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ప్రజల 60 ఏళ్ల స్వప్నం సాకారమైన రోజు జూన్ 2 అని పేర్కొన్నారు. అనేక త్యాగాలు, పోరాటాలు, ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ సాధనకు ప్రధాన శిల్పిగా నిలిచిన కేసీఆర్ 14 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాడి, శాంతియుత మార్గంలో రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. దేశంలోని వివిధ రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.

కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడంతో పాటు ఉద్యమ సమయంలో ప్రజలు కోరుకున్న నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దఎత్తున నెరవేర్చిందని అన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన నరేందర్, ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు, అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రస్తుతం రైతులు, యువత, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై నిరంతరం పోరాటం చేస్తామని, ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో కేసీఆర్‌ను మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసే దిశగా బీఆర్ఎస్ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో భాగంగా తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ అమరవీరులను స్మరించుకుని శ్రద్ధాంజలి ఘటించారు.

తదుపరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ పోరాట ఘట్టాలను స్మరించుకున్నారు. కార్యక్రమం ముగింపులో ప్రజలకు పండ్ల పంపిణీ చేశారు.

Leave a Reply