తెలంగాణ దశాబ్ద కాల అభివృద్ధి దేశానికి ఆదర్శం

తెలంగాణ దశాబ్ద కాల అభివృద్ధి దేశానికి ఆదర్శం
- పట్టణంలోని అమర వీరుల స్థూపానికి నివాళర్పిoచి మాజీ ఎమ్మెల్యే పెద్ది
నర్సంపేట, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రం గత దశాబ్ద కాలంలో సాధించిన అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం గులాబీ జెండా, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఉద్యమకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జోహార్లు అర్పించారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సేవలను స్మరించుకున్నారు. వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేళ్ల పాటు కేసీఆర్ పాలనలో సాగునీరు, తాగునీరు, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పలు కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధికి పునాదులు వేశారని అన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, సంక్షేమ పథకాల అమలులో లోపాలు ఉన్నాయని విమర్శించారు.
తెలంగాణ ఆత్మగౌరవం, స్వయంపాలన పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, కేసీఆర్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు పరిశీలించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టి. రవీందర్‌రావు, నాగిల్లి వెంకట్ నారాయణ గౌడ్, నల్ల మనోహర్ రెడ్డి, వేణుముద్దల శ్రీధర్ రెడ్డి, గోనె యువరాజ్, సత్యనారాయణ, కౌన్సిలర్లు శివరాత్రి స్వామి, నవీన్ నాయక్, మండల శ్రీనివాస్, నాగిశెట్టి ప్రసాద్, మచ్చిక నరసయ్య, ఇర్ఫాన్ ఎస్.కె., పైసా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
