Strait of Hormuz | హోర్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్ పై దాడి..
Strait of Hormuz | హోర్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్ పై దాడి..
- ముగ్గురు భారతీయులు గల్లంతు..
ఆంధ్రప్రభ, మస్కట్: ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిలో (Strait of Hormuz ) ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణాత్మక వాతావరణం కారణంగా ఈ ప్రాంతంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలు లక్ష్యంగా మారుతున్నాయి. ఒమాన్ తీరంలోని హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇంధన ట్యాంకర్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో ముగ్గురు భారతీయులు గల్లంతైనట్లు సమాచారం. పలావు జెండాతో ప్రయాణిస్తున్న సెట్టెబెల్లో అనే ఇంధన ట్యాంకర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఒమాన్‌లోని సోహార్ తీరానికి సమీపంలో (ఈశాన్యంగా సుమారు 20 నాటికల్ మైళ్ల దూరంలో ) ప్రయాణిస్తున్న సమయంలో ఈ ట్యాంకర్ నుంచి అత్యవసర సంకేతం అందిందని బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ వాంగార్డ్ టెక్ వెల్లడించింది. ఇంజిన్ గదిలో మంటలు చెలరేగినట్లు, క్షిపణి దాడి కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా, వారిలో 24 మంది భారతీయులు ఉన్నారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అందులో 21 మందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ముగ్గురు భారతీయుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపింది.
ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ నిరంతరం నిఘా ఉంచిందని, ఒమాన్ అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. గల్లంతైన సిబ్బంది కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపింది. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. క్షిపణి దాడి జరిగిందన్న వార్తలపై అధికారిక ధృవీకరణ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సోహార్ తీర ప్రాంతం, హోర్ముజ్ జలసంధి పరిసరాలు అత్యంత సున్నిత ప్రాంతాలుగా మారాయి. యుద్ధ పరిస్థితులు ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతంలో నౌకలపై పలు భద్రతా ఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనకు ముందు సోమవారం ఇరాన్ తీరంవైపు ప్రయాణిస్తున్న బోట్స్వానా జెండా కలిగిన ఎంటీ లెక్సీ (MT Lexie) అనే నౌకపై అమెరికా దళాలు క్షిపణి దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. అదే రోజు పలావు జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ మారివెక్స్ (MT Marivex) నౌకపై కూడా అమెరికా నౌకాదళానికి చెందిన USS Abraham Lincoln నుంచి బయలుదేరిన యుద్ధవిమానాలు దాడి చేసినట్లు కథనాలు పేర్కొన్నాయి.
మరోవైపు, ఇరాన్‌కు చెందిన డ్రోన్లు కూడా ఈ ప్రాంతంలో నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. దీంతో హోర్ముజ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు అత్యంత ప్రమాదకర ప్రాంతంగా మారుతోంది. హోర్ముజ్ జలసంధి అత్యంత ఇరుకైన ప్రాంతంలో కేవలం 38 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈ కీలక సముద్ర మార్గంపై ఇరాన్, ఓమన్ దేశాల నియంత్రణ ఉంది. ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతోంది. ప్రాంతంలో పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగితే హోర్ముజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలపై రుసుములు విధించే అవకాశాన్ని ఇరాన్ ఇప్పటికే ప్రస్తావించింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్య, ఇంధన రంగాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
