Ben Stokes Dropped | నైట్‌క్లబ్ వివాదం.. స్టోక్స్‌పై ECB వేటు!
Ben Stokes Dropped | నైట్‌క్లబ్ వివాదం.. స్టోక్స్‌పై ECB వేటు!
- రెండో టెస్టుకు ఇంగ్లండ్ కెప్టెన్ ఔట్..
- జో రూట్‌కు నాయకత్వ బాధ్యతలు
ఆంధ్రప్రభ, స్పోర్ట్స్: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes )కు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) షాక్ ఇచ్చింది. నైట్‌క్లబ్ వివాదంలో చిక్కుకున్న స్టోక్స్‌తో పాటు ఆల్‌రౌండర్ గస్ అట్కిన్సన్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్టుకు జట్టులో నుంచి తప్పించింది.
న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో టెస్టు కోసం ఈసీబీ ప్రకటించిన జట్టుకు మాజీ కెప్టెన్ జో రూట్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించారు. అలాగే స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్, వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ జోర్డాన్ కాక్స్లకు కూడా జట్టులో చోటు దక్కింది.
అయితే, లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన అనంతరం స్టోక్స్, అట్కిన్సన్ జట్టు నిబంధనలను ఉల్లంఘించి నైట్ క్లబ్ కు వెళ్లినట్టు.. అక్కడ ఓ రగ్బీ అకాడమీ ఆటగాడితో ఘర్షణకు దిగినట్లు బ్రిటిష్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ECB భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయాలై కుట్లు కూడా పడ్డట్లు సమాచారం.
అయితే, స్టోక్స్ , అట్కిన్సన్ గొడవను ప్రారంభించలేదని కొంతమంది ECB వర్గాలు పేర్కొన్నప్పటికీ, జట్టు నియమాలను ఉల్లంఘించినందుకు వారిపై చర్య తప్పలేదని తెలుస్తోంది. మరోవైపు స్టోక్స్ భవిష్యత్తుపై కూడా చర్చ మొదలైంది. ఈ వివాదం తర్వాత స్టోక్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశాలూ ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా, లార్డ్స్ టెస్టులో 115 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇంగ్లండ్ ప్రస్తుతం సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు జూన్ 17 నుంచి 21 వరకు లండన్‌లోని ది ఒవల్ మైదానంలో జరగనుంది.
రెండో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), రేహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సోనీ బేకర్, షోయబ్ బషీర్, జేకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, మాథ్యూ ఫిషర్, ఎమిలియో గే, జేమ్స్ ర్యూ, ఒల్లీ రాబిన్సన్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్.
