దండేపల్లిలో ఉత్సాహంగా బడిబాట కార్యక్రమం..
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని మాదాపూర్ గ్రామాల్లో బుధవారం దండేపల్లి పీఎం శ్రీ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా ఉపాధ్యాయులు ఇంటింటా ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి, ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య, ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం వంటి సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు వివరించారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపడ్డాయని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పీఎం శ్రీ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంఘర్ష రాజేశ్వర్ రావు, ఉపాధ్యాయులు పాత రమేష్ తదితరులు పాల్గొన్నారు.
