కర్నూలు బ్యూరో మహాశివరాత్రిని పురస్కరించుకుని నవాహ్నికదీక్షతో పదకొండురోజుల పాటు నిర్వహింపబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం తెల్లవారుజామున ముగిశాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజామున ఒకటిన్నర గంట వరకు స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.సాయంకాలం ప్రభోత్సవంతో కార్యక్రమాలు మొదలయ్యాయి.

ఆ తర్వాత నందివాహనసేవ ఆలయ ఉత్సవంగా నిర్వహించారు. అనంతరం రాత్రి 10 గంటలకు శ్రీస్వామివారికి లింగోద్భవకాల మహారుద్రాభిషేకం జరిపించారు. నిష్ణాతులైన 11 మంది అర్చక స్వాములు, వేదపండితులు మహాన్యాసపూర్వకంగా రుద్ర మంత్రాలను పఠిస్తుండగా, దాదాపు 4గంటలకు పైగా జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీస్వామివారికి అభిషేకం జరిపించడం విశేషం.ఆలయప్రాంగణంలోని పవిత్రమైన మల్లికాగుండంలోని జలంతోను, పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ ఈ అభిషేకం నిర్వహించడం గమనార్ధం. ఆ తర్వాతవెంటనే పాగాలంకరణ ప్రారంభించారు.
*కమనీయం స్వామి అమ్మవార్ల. కల్యాణోత్సవం*
ఇక రాత్రి గం.12.00 లకు మొదలై గురువారం తెల్లవారుజామున ఒకటిన్నర గంట వరకు స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా,కనుల పండువగా నిర్వహించారు. ఈ కల్యాణోత్సవంలో స్వామివారు పట్టువస్త్రాన్ని ధరించి, తలపై ఒకవైపు గంగమ్మను, మరొకవైపు నెలవంకను, మెడలో ఆభరణాలు, నుదుట విభూతి రేఖలను, పట్టువస్త్రాలను ధరించి పెండ్లికుమారుడుగా ముస్తాబు కాగా, మరోవైపు అమ్మవారు కూడా పట్టువస్త్రాలను ధరించి, నుదుట కల్యాణ తిలకాన్ని, బుగ్గన చుక్కను, సర్వాభరణాలను ధరించి పెండ్లికుమార్తె అయి స్వామికి సరిజోడనిపించనున్నారు. మంగళతూర్యనాదాలతో, వేదమంత్రాల నడుమ నేత్రానందంగా ఈ కల్యాణోత్సవంను నిర్వహించడం విశేషం. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ముందుగా అర్చకస్వాములు కల్యాణోత్సవ సంకల్పాన్ని పటించగా.. ఆ తరువాత కల్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని గణపతిపూజ, ఆ తరువాత వృద్ధి అభ్యుదయాల కోసం పుణ్యహవచనం,తరువాత కంకణపూజను నిర్వహించడం జరిగింది.
అనంతరం యజ్ఞోపవీతపూజ చేసి స్వామివారికి కంకణధార, యజ్ఞోపవీతధారణ తంతు ముగించారు. అనంతరం సప్త ఋషుల ప్రార్ధన చేసి కన్యావరణ మంత్రాలను పాటించారు, ఆ తరువాత స్వామివారికి వరపూజను జరిపించారు.అనంతరం స్వామిఅమ్మవార్ల ప్రవర పఠనాన్ని పటించి, తరువాత స్వామివారికి మధువర్మం, శ్రీస్వామిఅమ్మవార్లకు వస్త్రాలను సమర్పించారు. తరువాత భాషికధారణ కార్యక్రమం, ఆ తరువాత గౌరీపూజ, అనంతరంస్వామిఅమ్మవార్ల మధ్య తెర సెల్లను ఏర్పరచి మహాసంకల్ప పఠనం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం సుముహూర్త సమయంలో స్వామిఅమ్మవార్లకు జీలకర్ర, బెల్లం, ఆ తరువాత మాంగల్యపూజను జరిపించి అమ్మవారికి మాంగల్యధారణ జరిపించారు. అనంతరం తలంబ్రాలు, బ్రహ్మముడి తదితర కార్యక్రమాలతో శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణోత్సవ ఘటం ముగించారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాన్ని అందజేశారు.