రైతులపై ధరల భారం
రైతులపై ధరల భారం
- పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు
- భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలు
- రైతులకు భారంగా మారనున్న ధరల పెంపు
నాగర్కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ:
వ్యవసాయ సీజన్లో కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ఇప్పటికే గత మే నెలతో పోలిస్తే ఈ జూన్ నెల నాటికి ధరలు పెరిగాయి. వచ్చే నెలలో కూడా మరింత పెరిగే అవకాశం ఉందని కాంప్లెక్స్ ఎరువుల వ్యాపారులు, రైతులు చెబుతున్నారు.డీఏపీ, యూరియా రైతులకు అవసరమయ్యే ప్రధాన ఎరువులు అయినప్పటికీ, వీటి ధరలు పెరగకపోయినా ఎప్పుడూ కొరతే ఉంటుందని రైతులు అంటున్నారు. దాదాపు 12 రకాల కాంప్లెక్స్ ఎరువులు ఉండగా, రైతులు ఎక్కువగా వినియోగించే 20:20 ఎరువు ధర రూ.2,100 ఉండగా ప్రస్తుతం రూ.2,150కు చేరింది. భవిష్యత్తులో ఇది రూ.2,350 అయ్యే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
17:17 ఎరువు రూ.1,850 ఉండగా రూ.2,150కు పెరిగింది. 10:26:26 ఎరువు రూ.2,025 ఉండగా రూ.2,450కు పెరిగింది. ఇలా దాదాపు రూ.300 నుంచి రూ.500 వరకు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. 12:32:16 ఎరువు రకం రూ.1,900 ఉండగా రూ.2,450 అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. 14:35:14 ఎరువు రూ.1,900 నుంచి రూ.2,350కు పెరిగింది. ఇలా 11 రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగాయి.
నాగర్కర్నూల్ జిల్లాలో ఈ వ్యవసాయ సీజన్లో 1,92,796 ఎకరాల్లో వరి సాగు, 3,08,845 ఎకరాల్లో పత్తి సాగు, 96,992 ఎకరాల్లో మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు కలిపి మొత్తం 6,87,215 ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా ఉంది. మొత్తంగా కాంప్లెక్స్ ఎరువులు 37,203 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయి. యూరియా 66,508 మెట్రిక్ టన్నులు, డీఏపీ 14,089 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 1,816 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 2,265 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా వేశారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలు డీఏపీ 438 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 421 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 8,314 మెట్రిక్ టన్నులు, యూరియా 12,635 మెట్రిక్ టన్నులు ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరుకుల లభ్యత తగ్గడం, అందుబాటులో ఉన్న సరుకులకు డిమాండ్ పెరగడం ప్రధాన కారణాలని వ్యాపారులు చెబుతున్నారు. ఏదేమైనా ఎరువుల ధరల పెరుగుదల రైతులకు భారంగా మారింది. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఎరువుల ధరలు తగ్గించే చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
