ఈఎస్ఐసీ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

ఈఎస్ఐసీ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

ఇన్సూర్డ్ పర్సన్స్ పిల్లలకు ప్రత్యేక అవకాశం.. జూన్ 21 వరకు గడువు

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ఈఎస్ఐసీ) ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి బీమా గల ఉద్యోగుల (ఇన్సూర్డ్ పర్సన్స్) పిల్లలకు వైద్య, దంత, నర్సింగ్ విద్యలో ప్రత్యేక కోటా కింద ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఈఎస్ఐసీ కర్నూలు బ్రాంచ్ మేనేజర్ బి. దుర్గాప్రసాద్ తెలిపారు.

దేశవ్యాప్తంగా ఈఎస్ఐసీ నిర్వహిస్తున్న వైద్య, దంత, నర్సింగ్ కళాశాలలతో పాటు కొన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఇన్సూర్డ్ పర్సన్స్ పిల్లల కోసం ప్రత్యేక కోటా కింద మొత్తం 695 ఎంబీబీఎస్ సీట్లు, 28 బీడీఎస్ సీట్లు, 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

నీట్ (యూజీ)-2026లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ సీట్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. భారత ప్రభుత్వం, ఈఎస్ఐసీ నిబంధనల మేరకు ప్రవేశాల ప్రక్రియ నిర్వహించబడుతుందని తెలిపారు.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించే ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా నీట్ ర్యాంకు, అభ్యర్థుల ప్రాధాన్యతల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని వివరించారు. ప్రవేశాల ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

వార్డ్ ఆఫ్ ఐపీ (ఇన్సూర్డ్ పర్సన్ సంతానం) సర్టిఫికెట్ పొందేందుకు అర్హులైన విద్యార్థులు ఈఎస్ఐసీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు జూన్ 21 రాత్రి 11.59 గంటల వరకు గడువు ఉండగా, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ జూన్ 24 నాటికి పూర్తవుతుందని తెలిపారు.

అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఆయన, గ్రామ, వార్డు సచివాలయాలు, విద్యాసంస్థలు, ఉపాధి కార్యాలయాలు, కార్మిక సంఘాలు ఈ సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వివరాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఈఎస్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని, 08518-254175 ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.