పేదలకు ఇళ్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి
పేదలకు ఇళ్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఇళ్లు లేని పేదలకు సొంత నివాసం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి 2,500 నుంచి 3,000 వరకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఆ క్రమంలో గ్రామ గ్రామాన గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో పాటు లబ్ధిదారులు కొంత సొంతంగా సమకూర్చుకుంటే మంచి ఇళ్లు నిర్మించుకోవచ్చని సూచించారు. మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసుకోవాలని, విడతల వారీగా విడుదలయ్యే నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇప్పటివరకు ఇళ్లు మంజూరు కాకపోయిన వారు దరఖాస్తు చేసుకోవాలని, రెండో విడతలో అర్హులైన వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
నాగర్‌కర్నూల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తూడుకుర్తి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఆసుపత్రి, రహదారులు తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామని తెలిపారు. భవిష్యత్తులో కూడా గ్రామాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని, తన తండ్రితో కలిసి ఈ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
గ్రామ ప్రజలు ఐక్యంగా ఉండి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, సర్పంచ్ లక్ష్మీ-కరుణాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ వెంకటయ్య, గ్రామ కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
