కామారెడ్డిలో బాలుడి హత్య…
కామారెడ్డిలో బాలుడి హత్య…
- అక్రమ సంబంధం నేపథ్యంలో ఘటన..
- తల్లి సహజీవి అరెస్ట్
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ ; కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అర్గొండ గ్రామానికి చెందిన భాస్కర్ మాట్లాడుతూ తన కుటుంబంలో జరిగిన విషాద ఘటనను వివరించారు. గత రెండేళ్లుగా తాను తన భార్యతో విడిగా ఉంటున్నట్లు తెలిపారు. అర్గొండ గ్రామంలో తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలిసిన తర్వాత తాను దూరంగా ఉంటున్నానని చెప్పారు. భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. అతని భార్య కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్ వద్ద స్లీపర్ పనులు చేస్తూ లక్ష్మీ నరసింహులు అనే వ్యక్తితో పరిచయం పెంచుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపించారు.
తన కుమారుడు ఫోన్ చేసి “లక్ష్మీ నరసింహులు నన్ను కొడుతున్నాడు” అని చెప్పడంతో, గ్రామ పెద్దలతో కలిసి వెళ్లి బాలుడిని తన వద్దకు తీసుకువచ్చినట్లు తెలిపారు. అనంతరం రెండు నెలల తర్వాత భార్య వచ్చి గొడవ చేయడంతో మళ్లీ బాలుడిని ఆమెతో పంపించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే తన భార్య లక్ష్మీ నరసింహులు అనే వ్యక్తితో కలిసి కామారెడ్డి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న సమయంలో, ఐదేళ్ల బాలుడు శ్రావణను లక్ష్మీ నరసింహులు హత్య చేసినట్లు పట్టణ సీఐ నరహరి తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
