పట్టుదలతో చదివి లక్ష్యాలు సాధించాలి…

పట్టుదలతో చదివి లక్ష్యాలు సాధించాలి…

  • ఎంపీడీవో బాలరాజు ప్రిన్సిపాల్ ముఖేష్ కుమార్

గుండాల/ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : గుండాల మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ముఖేష్ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి గుండాల మండల ఎంపీడీవో దుద్దుకూరు బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో బాలరాజు మాట్లాడుతూ, విద్యార్థులు పట్టుదలతో చదివి తమ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఆ దిశగా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. వేసవి సెలవుల్లో పిల్లలు వాగులు, కుంటలు, చెరువుల్లో ఈతకు వెళ్లే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు వారి నడవడికను నిరంతరం గమనించాలని హెచ్చరించారు.

విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులు పరిశీలించి, మరింత మంచి మార్కులు సాధించేలా ప్రోత్సహించాలని కోరారు. పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు పొందేందుకు క్రమశిక్షణతో ప్రోత్సహిస్తూ అవసరమైతే ట్యూషన్లు, శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని సూచించారు.

మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎఫ్‌ఎల్‌ఎన్ (FLN) కార్యక్రమాల ద్వారా ఆకర్షణీయమైన బోధన పద్ధతులతో విద్యార్థులను తీర్చిదిద్దడంలో కృషి చేస్తున్నారని అభినందించారు. ప్రతి ఉపాధ్యాయుడు అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థులకు క్రమశిక్షణ, విలువలు నేర్పించడం ప్రశంసనీయమని కొనియాడారు.

ఏప్రిల్ 24 నుండి వేసవి సెలవులు ప్రారంభమై జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ సుమారు 50 రోజుల సమయంలో తల్లిదండ్రులు పిల్లలను సక్రమంగా మార్గనిర్దేశం చేసి తిరిగి పాఠశాలలకు పంపేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముత్తాపురం కార్యదర్శి బండారి సతీష్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply