పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యం..
పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యం..
శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యమైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. పుట్టపర్తి గోకులం ప్రాంతానికి చెందిన జి. సుమలత (20) తన మూడేళ్ల కుమారుడు హేమంత్ రెడ్డితో కలిసి ఈ నెల 29వ తేదీ నుంచి కనిపించడం లేదు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, తన కుమారుడికి పల్స్ పోలియో చుక్కలు వేయించి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన సుమలత అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భర్త బాబు రెడ్డి బంధువుల ఇళ్లతో పాటు పలుచోట్ల గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు.
ఆయన పుట్టపర్తి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లి, బిడ్డ ఆచూకీ కోసం వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సుమలత, హేమంత్ రెడ్డి ఆచూకీ తెలిసిన వారు వెంటనే పుట్టపర్తి టౌన్ సీఐని 9440796848 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా కుటుంబ సభ్యుల వద్దకు చేరేందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
