Baya Weaver Bird | ఆడ పక్షిని ఆకట్టుకునే మగ పక్షి నైపుణ్యం
Baya Weaver Bird | ఆడ పక్షిని ఆకట్టుకునే మగ పక్షి నైపుణ్యం
Baya Weaver Bird | గిజిగాడి గూళ్లు..
ప్రకృతి ప్రసాదించిన అద్భుత నిర్మాణ కళ
తుఫాన్లనూ తట్టుకునే గూళ్ల వెనుక ఇంజినీరింగ్ రహస్యం
Baya Weaver Bird | ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ: బుల్లి పిట్ట మేధస్సు ఎంత అద్భుతమైనదో… ఈ గిజిగాడి గూళ్లు చూస్తే అర్థమవుతుంది. అద్భుతమైన నైపుణ్యం, తుఫాన్లను తట్టుకునే పటిష్ఠత ఈ గూళ్ల ప్రత్యేకత. అంతేకాదండోయ్… ఆడ పక్షిని ఆకట్టుకునేందుకు, తనతో సహజీవనం చేసేందుకే చేసే ఏర్పాటే ఇంత చక్కటి ఆవాసం.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో కాలువలు, చెరువుల గట్లపై ఈత, తుమ్మ ముళ్ల చెట్ల కొమ్మలకు వేలాడే సొగసైన గడ్డి పోచల గూళ్లు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బుల్లి విహంగాలు తమ చిట్టి మేధస్సు, నేర్పరితనంతో కేవలం మూడు వారాల్లోపే గడ్డి పోచలతో గూళ్లు నిర్మించుకునే విధానం ఎవరికైనా అనుసరణీయం అనడంలో అతిశయోక్తి లేదు.
సొంతగా నిర్మించుకునే ఈ గూళ్లలోనే ఆడ పక్షిని ఆకట్టుకుంటూ మగ పక్షులు సహజీవనం సాగిస్తున్నాయి. మానవ మేధస్సును తలదన్నేలా అద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యంతో అల్లికలతో ఏర్పాటు చేసుకునే ఈ గూళ్లు తుఫాను వచ్చినా, భీకర గాలులు వీచినా చెక్కుచెదరకపోవడం వీటి ప్రత్యేకత. కనువిందు చేసే ఈ అందమైన పక్షి గూళ్లు ఆదిలాబాద్ కేంద్రానికి సమీపంలోని శంకర్‌గుట్ట, దుర్గానగర్, మావల, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ సమీపంలోని కాలువల గట్లపై తుమ్మ చెట్లలో కనిపిస్తున్నాయి.
నైపుణ్యం.. నేర్పరితనం మేళవింపు
గిజిగాడు నిర్మించే గూడులో అద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యమే కాకుండా నేర్పరితనం కూడా మనకు గోచరిస్తుంది. గడ్డి పోచలను ముక్కుతో కరుచుకొని వచ్చి అల్లికలతో శత్రు దుర్భేద్యంగా మగజాతి పక్షులు గూళ్లు నిర్మిస్తాయి. ఒక్కో పక్షి గూడు కట్టడానికి 18 నుంచి 21 రోజులు కష్టపడతాయని పక్షుల జాతిని అధ్యయనం చేసే ఆర్నిథాలజిస్ట్ నిపుణులు పేర్కొంటున్నారు.
శత్రువులను ఎదుర్కోవడం, పొదిగిన గుడ్లు, పిల్లలను కాపాడుకోవడానికే ముళ్ల చెట్లపై కాలనీ తరహాలో వరుసగా గూళ్లు నిర్మించుకుంటాయి. ఆడ పక్షికి ఈ గూడు నచ్చితే వెంటనే అక్కడికి వాలిపోయి మగపక్షితో కలిసి సహజీవనం చేస్తాయి. పాములు, ఇతర కీటకాలు కూడా ఈ గూడులోకి వెళ్లేందుకు సాహసం చేయవు.
వీటిని నిర్మించే పక్షులు ఫ్లోసిడే కుటుంబానికి చెందిన బంగారు పిట్టలని, శాస్త్రీయ నామం ఫ్లోసియస్ ఫిలిప్పీనస్ (Ploceus philippinus) అని పిలుస్తారు. తలపై పసుపు రంగు కిరీటంతో ఉండే ఈ మగ పక్షి ఆడ పక్షిని ఆకట్టుకుని బుట్టలో వేసుకుంటుంది. పునరుత్పత్తిలో ఒక్కో ఆడ పక్షి రెండు నుంచి ఐదు గుడ్లు పెట్టి, ఆ తర్వాత పిల్లలకు ఆహారాన్ని నోటితో అందించడం మరో ఆసక్తికర అంశంగా చెప్పవచ్చు.
