Work From Home | కేంద్రానికి ఐటీ ఉద్యోగుల సంఘం లేఖ

Work From Home | కేంద్రానికి ఐటీ ఉద్యోగుల సంఘం లేఖ
Work From Home | బెంగళూరు : ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు అధికారికంగా దీన్ని అమలు చేయాలని ఐటీ ఉద్యోగుల సంఘం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనెట్ (నైట్స్) కేంద్రాన్ని కోరింది. మొత్తం 58 లక్షల మంది ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోంను తప్పనిసరి చేయాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాకు రాసిన లేఖలో కోరింది. ఇంధన వ్యయాలు తగ్గించడానికి పొదుపు చర్యలు చేపట్టాలన్న ప్రధాన మంత్రి పిలుపు మేరకు ఈ చర్య తీసుకోవాలని కార్మిక శాఖకు రాసిన లేఖలో నైట్స్ కోరింది.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన, ఇతర సరఫరాలకు ఏర్పడిన అంతరాయాల సవాల్‌ను ఎదుర్కోనేందుకు దేశం ఇంధన దిగుమతుల బిల్లును తగ్గించుకునేందుకు కోవిడ్ సమయంలో తీసుకున్న పొదుపు చర్యలను పాటించాలని ప్రధాని కోరారు. ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించుకోవడం ద్వారా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
• బెంగళూర్లో టెకీల హర్షం
ప్రధాని సూచనలకు అనుగుణంగా సాధ్యమైన చోట్ల కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని కార్మిక శాఖను నైట్స్ కోరింది. డిజిటల్ ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ లక్షలాది మంది ఉద్యోగులు ప్రతిరోజూ ప్రయాణించాల్సి రావడం వల్ల ఇంధన వినియోగం పెరగడంతో పాటు, పట్టణ మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపింది. మెట్రో నగరాల్లో ప్రయాణానికే ఉద్యోగులు అనేక గంటలు సమయం కేటాయించాల్సి వస్తోందని పేర్కొంది. ఇది నివారించదగిన ఇంధన వినియోగానికి, పర్యావరణ భారానికి దారితీస్తోందని ఈ లేఖలో నైట్స్ పేర్కొంది.
ప్రధాని పిలుపుపై బెంగళూరు టెకీలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూర్లో ఐటీ కారిడార్‌కు ప్రయాణం నరకప్రయాణంగా మారడమే ఇందుకు కారణం. ప్రతిరోజూ ట్రాఫిక్‌లో గంటల కొద్దీ సమయం గడపాల్సి వస్తుండడంతో ప్రధాని పిలుపుతో వర్క్ ఫ్రమ్ హోం ఇస్తే, ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని వీరు భావిస్తున్నారు.
ఆఫీస్‌లో పని చేసే సమయంలో సగం సమయం ప్రయాణానికే పోతుందని చాలా మంది బెంగళూరు టెకీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వర్క్ ఫ్రమ్ హోం ఇస్తే చాలా సంతోషమని, తమకు ప్రయాణ సమయం కలిసి రావడంతో పాటు, ఇంధన పొదుపుకు ఇది దోహదం చేస్తుందని టెకీలు అభిప్రాయపడుతున్నారు.
