బెట్టింగ్ యాప్లతో టాలీవుడ్‌లో ప్రకంపనలు

బెట్టింగ్ యాప్లతో టాలీవుడ్‌లో ప్రకంపనలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: డబ్బు సంపాదన కోసం ఎంతకైనా దిగజారుతారన్న మాట తాజాగా వెలుగు చూస్తున్న సంఘటనలు నిజమేనని నిరూపిస్తున్నాయి. చేతినిండా షోలు, ఖరీదైన కార్లు, ఏసీ బంగళాలు ఉన్నా కొంతమంది సెలబ్రిటీలు డబ్బు కోసం సామాజిక బాధ్యతను గాలికి వదిలేస్తున్నారు. గతంలో వందల మంది ఆత్మహత్యలకు కారణమైన క్రికెట్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి విమర్శలు మూటగట్టుకున్న కొందరు తారలు, ఇప్పుడు మరింత బరితెగించి సోషల్ మీడియా వేదికగా ఆశ్లీలతను వ్యాపారం చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక చానళ్లు ఏర్పాటు చేసి, బోల్డ్ కంటెంట్ పేరుతో డబ్బు వసూలు చేస్తూ అంగాంగ ప్రదర్శనలకు దిగడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

బెట్టింగ్ మాఫియాతో సెలబ్రెటీల లింకులు

క్రికెట్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వ్యవహారం గతంలోనే టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఈ దందా వల్ల పదుల సంఖ్యలో యువకులు అప్పులపాలై ప్రాణాలు తీసుకున్నారు. దీనిపై పంజాగుట్ట మియాపూర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను సీఐడీ విచారించగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దగ్గుబాటి రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మితో పాటు బుల్లితెరకు చెందిన శ్యామల, విష్ణుప్రియ, రీతూ చౌదరి వంటి వారు ఈ యాప్లను ప్రమోట్ చేసినట్లు తేలింది. వీరికి ఈడీ, సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణ కూడా జరిపారు. సరిపడా సంపాదన ఉన్నప్పటికీ కేవలం అదనపు ఆదాయం కోసం ఇలాంటి యాప్ల ప్రమోషన్లకు సహకరించడం వివాదాస్పదమైంది.

తాజాగా బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వేల సంఖ్యలో ఉన్న ఫాలోవర్లను క్యాష్ చేసుకునేందుకు ఆమె బోల్డ్ కంటెంట్ పేరుతో ఒక చానల్‌ను ప్రారంభించింది. నెలకు రూ.389 సబ్‌స్క్రిప్షన్ చెల్లిస్తే తన వీడియోలు, ఫోటోలు కనిపిస్తాయని పేర్కొంటూ… అర్ధనగ్నంగా ఉన్న కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తోంది. దీనిపై ఏఐఎస్ఎఫ్ నాయకులు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు కోసం ఇలాంటి అశ్లీల వీడియోలు పెట్టడం వల్ల సమాజంలో నేరాలు పెరిగే ప్రమాదం ఉందని, ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను వెంటనే బ్లాక్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.

యువతను తప్పుదోవ పట్టించే ప్రమాదముంది

పోలీసులు కేవలం సెలెక్టివ్ కేసుల మీదనే చర్యలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్లు, ఆన్‌లైన్ గేమ్స్ మీద గతంలో పలువురు ప్రముఖ సెలబ్రిటీస్ ప్రమోషన్స్ చేశారు. వారిని చూసి చాలామంది బెట్టింగ్ యాప్స్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోయారు. వాటికోసం చేసిన అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉన్నారు. వీటిపై కేసులు నమోదైనా చర్యలు కానరావడం లేదు. యాంకర్ విష్ణుప్రియ బోల్డ్ కంటెంట్ విషయానికి వస్తే… ఆడవారిని ఒక విలాస వస్తువుగా చూడొద్దని చట్టం చెబుతున్నా… తానే తన శరీరాన్ని కొంత డబ్బు చెల్లించి చూడొచ్చు అని ప్రకటించడం తప్పుడు సంకేతాలకు దారితీస్తుంది. స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడిగా స్కిన్ ప్రెజెంటేషన్ చేయడం అనైతికం. ఇలాంటి విషయాల్లో కొన్ని ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలి.

  • రామారావు ఇమ్మనేని,
  • ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది,
  • హైదరాబాద్

Leave a Reply