ఫ్రాన్స్ పర్యటన చివరి దశలో మోడీ..

  • పారిస్‌లో సీఈవోలతో భేటీ
  • వివాటెక్-2026 సదస్సులో ప్రసంగం
  • భారత సాంకేతికత, ఏఐ, స్టార్టప్ శక్తిని ప్రపంచానికి చాటనున్న ప్రధాని

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నీస్, జీ7 సదస్సు కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు పారిస్‌కు చేరుకోనున్నారు. పర్యటన చివరి దశలో భాగంగా ఆయన యూరప్‌లోని అతిపెద్ద సాంకేతిక, ఆవిష్కరణల వేదికలలో ఒకటైన వివాటెక్-2026 (VivaTech 2026) సదస్సులో పాల్గొననున్నారు. పారిస్ చేరుకున్న తర్వాత ప్రధాని మోడీ పలు అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యనిర్వాహక అధికారులతో (సీఈవోలు) సమావేశం కానున్నారు. ఈ భేటీల్లో పెట్టుబడులు, కృత్రిమ మేధస్సు (ఏఐ), డిజిటల్ సాంకేతికత, తయారీ రంగం, స్టార్టప్ వ్యవస్థ, ఆవిష్కరణలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.

వివాటెక్ వేదికగా భారత్ సత్తా..

యూరప్‌లో ప్రముఖ టెక్నాలజీ, స్టార్టప్ సదస్సుగా గుర్తింపు పొందిన వివాటెక్-2026లో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. భారతదేశం సాంకేతిక రంగంలో సాధిస్తున్న పురోగతి, ఏఐ విప్లవం, స్టార్టప్ ఎకోసిస్టమ్, డిజిటల్ మౌలిక వసతులు, నవీన ఆవిష్కరణలను ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు. అలాగే భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, సాంకేతిక సహకారం విస్తరించడం, పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలు కూడా ఈ పర్యటనలో కీలకంగా ఉండనున్నాయి.

ప్రవాస భారతీయులతో ముఖాముఖి..

సదస్సు అనంతరం ప్రధాని మోడీ పారిస్‌లో నిర్వహించే ప్రత్యేక కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ప్రజల మధ్య బంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు భారత్-ఫ్రాన్స్ సంబంధాలకు కొత్త ఊపు తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.