మహిళా సంక్షేమానికి పెద్దపీట

మహిళా సంక్షేమానికి పెద్దపీట

  • ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)లో మహిళలు భారీగా లాభపడుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కోట్లాది మహిళలు ప్రయాణించి వేల కోట్ల రూపాయలు ఆదా చేసుకున్న సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లాలనుకునే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు.

ఉచిత ప్రయాణం చేసిన మహిళల ఖర్చును ప్రభుత్వం భరిస్తూ ఆర్టీసీకి ఆర్థికంగా బలాన్నిచ్చిందని తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు ప్రభుత్వం రూ.8.98 కోట్లు ఆర్టీసీకి చెల్లించినట్లు వెల్లడించారు. ఈ పథకం వల్ల నారాయణపేట జిల్లా మహిళలు రోజుకు సుమారు రూ.41.79 లక్షలు ఆదా చేసుకుంటున్నారని తెలిపారు.

ప్రభుత్వం సమయానికి నిధులు చెల్లించడం వల్ల ఆర్టీసీ నిలదొక్కుకోవడానికి సహాయపడిందని అన్నారు. ఉచిత బస్సు పథకంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు.

ఉచిత ప్రయాణంతో మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారని తెలిపారు. “నిజం గడప దాటకముందే అబద్ధం ఊరంతా తిరుగుతుంది” అంటూ ప్రతిపక్షాలపై ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, ఆర్టీఏ సభ్యుడు గోపాల్ రెడ్డి, డీటీఓ బాలు నాయక్, డిపో మేనేజర్ ఏ. యాదయ్య, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply