పెద్దవాగులో విషాదం..

చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతు

పెంచికల్‌పేట్, ఆంధ్రప్రభ : మండలంలోని దహెగాం వెళ్లే రహదారిపై ఉన్న పెద్దవాగులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. పెంచికల్‌పేట్ గ్రామానికి చెందిన మేకల జంపన్న (20) శుక్రవారం స్నేహితులతో కలిసి చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు.

స్థానికుల వివరాల ప్రకారం.. పెంచికల్‌పేట్‌కు చెందిన మేకల జంపన్న, అతని స్నేహితుడు అరికిళ్ల కిషోర్‌తో కలిసి చేపలు పట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఎల్కపల్లి గ్రామానికి చెందిన ఓ బాలుడితో కలిసి స్నానం చేయడానికి పెద్దవాగులోకి దిగారు. లోతును అంచనా వేయకపోవడంతో జంపన్న నీటిలో మునిగిపోయాడు.

పాత వంతెన సమీపంలో పిల్లర్‌ రాడును పట్టుకుని బాలుడు బయటకు వచ్చాడు. జంపన్న కనిపించకపోవడంతో అతను కేకలు వేయగా చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ జంపన్న ఆచూకీ లభించలేదు.

కుటుంబానికి అండగా ఉండాల్సిన కుమారుడు గల్లంతు కావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వారి విషాదం పలువురిని కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న కాగజ్‌నగర్ రూరల్ సీఐ కుమారస్వామి, పెంచికల్‌పేట్ ఎస్సై అనిల్ కుమార్, దహెగాం ఎస్సై చుంచు రమేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.