ప్రజల మాటే పాలనకు మార్గదర్శకం

  • ప్రజాభిప్రాయంతో పాలనను మరింత మెరుగుపరుస్తున్నాం
  • ప్రజాదర్బారులో సమస్యలపై ఎమ్మెల్యే గద్దె ఆరా
  • డోర్‌-టు-డోర్‌తో ఇంటింటికీ కూటమి అభివృద్ధి
  • సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తి
  • అవాస్తవ ప్రచారాలను తిప్పికొట్టాలి
  • ఇద్దరు బాధితులకు ఆర్థిక చేయూత

విజయవాడ, ఆంధ్రప్రభ: ప్రజల అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుంటేనే పాలనను మరింత మెరుగుపరచగలం. టీడీపీ డోర్‌-టు-డోర్‌ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూనే వారి అభిప్రాయాలను కూడా నేరుగా తెలుసుకుంటున్నాం” అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. శుక్రవారం 12వ డివిజన్‌ అశోక్‌నగర్‌లోని రఘు గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రజాదర్బారులో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులతో సమావేశమై నియోజకవర్గంలో కొనసాగుతున్న టీడీపీ డోర్‌-టు-డోర్‌ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లడమే డోర్‌-టు-డోర్‌ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. అదే సమయంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, ప్రజల అవసరాలను గుర్తించి మెరుగైన పాలన అందించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. ‘సూపర్‌ సిక్స్‌’ పథకాల అమలుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంపై తమ ఆనందాన్ని ప్రజలు నేరుగా వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం కారణంగా ప్రతి మహిళకు నెలకు రూ.1,500 అందించే పథకాన్ని అమలు చేయలేకపోయామని, అవసరమైన నిధులు సమకూరిన వెంటనే ఆ పథకాన్ని కూడా అమలు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసిన 169 గ్రూప్‌-1 పోస్టుల విషయంలో అవకతవకలు జరిగాయని సిట్‌ కోర్టుకు తెలిపిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తమ ప్రభుత్వం డీఎస్సీని సమర్థవంతంగా నిర్వహించిందని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ చేస్తున్న అవాస్తవ ప్రచారాలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వాస్తవాలను వివరించాలని సూచించారు.

ప్రజాదర్బారు అనంతరం 22వ డివిజన్‌కు చెందిన మిరపల్లి సంజీవికి జీవనోపాధి కోసం ఎమ్మెల్యే తన సొంత నిధులతో రూ.7 వేల విలువైన ఇస్త్రీ పెట్టెను అందజేశారు. 20వ డివిజన్‌కు చెందిన పార్టీ కార్యకర్త కొక్కిలిగడ్డ కృష్ణంరాజుకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో చెన్నుపాటి గాంధీ, ముమ్మనేని ప్రసాద్‌, దేవినేని అపర్ణ, పేరేపి ఈశ్వర్‌, పొట్లూరు సాయిబాబు, పడాల గంగాధర్‌, సుగసాని రత్నశ్రీ కృష్ణప్రసాద్‌, పడమట సతీష్‌చంద్ర, నారెళ్ల రాజేష్‌, పఠాన్‌ హయత్‌ఖాన్‌, బచ్చులకూరి అజయ్‌కుమార్‌, మాదాల చిన్నతల్లి, బంగారు మురళీ తదితరులు పాల్గొన్నారు.