చెరువులో పడి వ్యక్తి మృతి

ఎడపల్లి, ఆంధ్రప్రభ: ఎడపల్లి మండలం అంబం గ్రామంలోని పోతాయి చెరువు వద్ద ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గంగమ్మ ఆలయం సమీపంలో నాగం చిన్న పోశెట్టి (46) మృతదేహాన్ని శుక్రవారం గుర్తించినట్లు ఎస్సై ముత్యాల రమ తెలిపారు.

ఈ నెల 12న నిజామాబాద్‌లోని తన సోదరి ఇంటికి వెళ్తున్నానని చెప్పి చిన్న పోశెట్టి ఇంటి నుంచి వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు జారి నీటిలో పడి మృతి చెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. మృతిపై ఎలాంటి అనుమానం లేదని మృతుడి భార్య నాగం సాయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.