ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రత
- వాణిజ్య పంటల వైపు రైతులు దృష్టి సారించాలి: కలెక్టర్ రాజర్షి షా
ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలంటే రైతులు సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చని తెలిపారు.
ఇంద్రవెల్లి మండలం శంకర్గూడ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన పామాయిల్ రైతుల అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ఏపీవో మంద మకరంద్‌తో కలిసి గ్రామంలో స్వయంగా ఆయిల్ పామ్ మొక్కలు నాటి రైతులను ప్రోత్సహించారు.
అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఒకసారి ఆయిల్ పామ్ తోటను ఏర్పాటు చేసుకుంటే సుమారు 25 నుంచి 30 సంవత్సరాల పాటు స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, ఇతర ప్రోత్సాహక పథకాలను సద్వినియోగం చేసుకుని అధిక లాభాలు పొందాలని సూచించారు.
నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ పంట ద్వారా రైతులకు దీర్ఘకాలిక ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.
ఐటీడీఏ ఏపీవో మంద మకరంద్ మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన మొక్కలు, సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి సహకారం అందిస్తామని తెలిపారు.
గిరిజన రైతులు ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం. ప్రవీణ్, వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, జిల్లా ఉద్యాన అధికారి సందీప్ కుమార్, స్థానిక సర్పంచ్ జాదో రోమా, ధనురా సర్పంచ్ జాదవ్ చమునా నాయక్, ముత్తునూర్ సర్పంచ్ రిత్తే విట్టల్, ఉద్యానవన అధికారి క్రాంతి కుమార్, మహేందర్, ఆయిల్ పామ్ ఏరియా మేనేజర్ బి. రమేష్, ఆయిల్ పామ్ అధికారి రాథోడ్ సిద్ధు, వ్యవసాయ అధికారులు, ఐదు మండలాల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు.
