వృద్ధురాలిపై లైంగిక దాడి యత్నం.. మైనర్‌పై కేసు

  • చిలుపూర్ మండలంలో ఘటన.. పోలీసులు దర్యాప్తు ప్రారంభం

చిలుపూర్, ఆంధ్రప్రభ : జనగామ జిల్లా చిలుపూర్ మండలం లింగంపల్లి గ్రామంలో 75 ఏళ్ల వృద్ధురాలిపై ఓ మైనర్ బాలుడు లైంగిక దాడి యత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలు గ్రామంలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె కుమారుడు హైదరాబాద్‌లో ఉండగా, వృద్ధురాలు మాత్రం గ్రామంలోనే ఉంటోంది. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో, తన మనవడు వచ్చి ఉంటాడని భావించి ఆమె తలుపు తీసినట్లు తెలిసింది.

తలుపు తెరిచిన వెంటనే అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలుడు ఇంట్లోకి ప్రవేశించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడి యత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధురాలు ప్రతిఘటించడంతో నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని చిలుపూర్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ నవీన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో రాత్రి వేళల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాత్రి సమయంలో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులపై పోలీసులు నిఘా పెంచాలని, గ్రామాల్లో తరచూ గస్తీ నిర్వహించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.